భారత్‌పై క్షిపణితో దాడి చేస్తాం: పాక్‌

30 Oct, 2019 08:15 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి దుందుడుకు బుద్ధిని ప్రదర్శించింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కయ్యానికి కాలు దువ్వింది. కశ్మీర్‌ అంశంలో భారత్‌తో పాటు భారత్‌కు మద్దతుగా నిలిచిన దేశాలన్నింటిపై క్షిపణి దాడి చేస్తామని పాక్‌ కశ్మీర్‌ వ్యవహారాల మంత్రి అలీ అమిన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడి, పాకిస్తాన్‌లోని జైషే ఉగ్ర క్యాంపులపై భారత వైమానిక దళ మెరుపు దాడుల నేపథ్యంలో భారత్‌- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను భారత కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన క్రమంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ అంశంలో భారత్‌ తీరును తీవ్రంగా విమర్శించిన పాక్‌.. అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను దోషిగా నిలబెట్టాలని చూసింది. అయితే ఇది తమ అంతర్గత విషయమని భారత్‌ తేల్చిచెప్పడంతో పాక్‌ మిత్రదేశం చైనా సహా ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, ఫ్రాన్స్‌, యూకే తదితర దేశాలు భారత్‌కు అండగా నిలిచాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన అలీ అమిన్‌... ‘కశ్మీర్‌ విషయంలో భారత్‌తో ఉద్రిక్తతలు తీవ్రమైన క్రమంలో పాకిస్తాన్‌ తప్పక యుద్ధానికి దిగుతుంది. భారత్‌పై క్షిపణి దాడులతో విరుచుకుపడతాం. అంతేకాదు ఈ విషయంలో మాకు కాకుండా భారత్‌కు మద్దతుగా నిలిచిన దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తాం. ఇకపై వారిని ఎల్లప్పుడూ పాకిస్తాన్‌ శత్రువులుగానే భావిస్తాం’  అంటూ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాక్‌ జర్నలిస్టు నైలా ఇనాయత్‌ ట్వీట్‌ చేయడంతో అలీ అమిన్‌ విద్వేషపూరిత ప్రసంగం వెలుగులోకి వచ్చింది. ఇక కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి తమకు మద్దతు రాకపోవడంతో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా ఇదే తరహా బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే. సెప్టెంబరులో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ... ‘ రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం జరిగితే దాని ప్రభావం ఏమేరు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మిమ్మల్నందర్నీ హెచ్చరిస్తున్నా. అయితే నిజానికి ఇవి నా బెదిరింపులు కావు..మీ గురించి బెంగ మాత్రమే. ఏదైనా జరగకూడనిది జరిగితే ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు మీరంతా సిద్ధంగా ఉండాలి. పొరుగుదేశం(భారత్‌) కంటే ఏడు రెట్లు చిన్నదైన పాకిస్తాన్‌ లొంగిపోతుందా.. లేదా స్వాతంత్ర్యం కోసం యుద్ధం చేస్తుందా అనేది త్వరలోనే స్పష్టమవుంది’ అని పేర్కొన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా