ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలి

17 Oct, 2016 02:31 IST|Sakshi
ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలి

ప్రపంచ దేశాలకు బ్రిక్స్ పిలుపు
బెనౌలిమ్(గోవా): ప్రపంచ దేశాలన్నీ తమ భూభాగాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఐక్యరాజ్యసమితి తీర్మానానికి త్వరితంగా ఆమోదం తెలపాలని బ్రిక్స్ దేశాల సదస్సు కోరింది. గోవాలో  జరిగిన వార్షిక సదస్సులో సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు ఈ మేరకు తీర్మానిస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశాయి. ఐరాస సాధారణ అసెంబ్లీలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం(సీసీఐటీ) ఆమోదంలో ఆలస్యం చేయవద్దంటూ సదస్సు చివరి రోజు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వ్యవస్థీకృత నేరాలైన మనీ ల్యాండరింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిర్మూలించడంతో పాటు ఉగ్రవాదుల స్థావరాల్ని నాశనం చేయడం, ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద అనుకూల ప్రచారాన్ని తిప్పికొట్టడంపై  ప్రధానంగా దృష్టి సారించాలని సదస్సు పేర్కొంది. ‘ఉగ్రవాదంపై విజయవంతమైన పోరాటానికి అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం అంతర్జాతీయ న్యాయం, మానవ హక్కులకు లోబడి ఉండాలి. ఈ పోరులో వివిధ దేశాల కూటముల మధ్య సమన్వయ పాత్రను ఐరాస పోషించాలి. ఐరాస ఉగ్రవాద వ్యతిరేక విధివిధానాలు సమర్థంగా అమలయ్యేందుకు కట్టుబడి ఉన్నాం’ అని సదస్సు తీర్మానంలో పేర్కొన్నారు.

ఎఫ్‌ఏటీఎఫ్‌ను అమలు చేయాలి
మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సాయంపై పోరులో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌పోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) నిబంధనలకు కట్టుబడి ఉంటామని   బ్రిక్స్ నేతలు చెప్పారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయంపై పోరుకు త్వరితంగా, సమర్థంగా అన్ని దేశాలు ఎఫ్‌ఏటీఎఫ్ అమలు చేయాలని కోరారు. మాదకద్రవ్యాల అక్రమ ఉత్పత్తి, రవాణాను అడ్డుకునేందుకు  సహకారం, సమన్వయం బలోపేతం చేసుకోవాలని సదస్సు పిలుపునిచ్చింది.
 
అవినీతిపై పోరుకు ప్రోత్సాహం
అనేక దేశాల్లో రాజకీయ, భద్రతాపర అస్థిరతపై బ్రిక్స్ ఆందోళన వ్యక్తంచేసింది. అంతర్జాతీయ  సమస్యల పరిష్కారంలో సహకారమందిస్తామంది. నిజాయతీతో కూడిన పన్ను వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అవినీతిపై అంతర్జాతీయ సహకారానికి చేయూతనిస్తామని తెలిపింది. అక్రమ ధనం,  విదేశాల్లో అక్రమ సంపదలు  ఆర్థిక వృద్ధి, అభివృద్ధిపై ప్రభావం చూపుతాయన్న సదస్సు... అవినీతికి వ్యతిరేకంగా ఐరాస తీర్మానానికి అనుగుణంగా సాగుతున్న పోరును ప్రోత్సహిస్తామని  తీర్మానించింది.
 
రష్యా నుంచి గ్యాస్ పైప్‌లైన్
భారత్, రష్యా మధ్య ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఖర్చుతో నిర్మించ తలపెట్టిన గ్యాస్ పైప్‌లైన్ సంయుక్త అధ్యయనానికి ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సమావేశాల్లో మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు  సంబంధిత పత్రంపై సంతకాలు చేశారు. ఈ సహజవాయివు పైప్‌లైన్ నిర్మాణానికి 25 బిలియన్ డాలర్ల ఖర్చవుతుంది. సైబీరియాలో ఉత్పత్తి అయిన గ్యాస్‌ను రష్యన్ గ్యాస్ గ్రిడ్‌కు అనుసంధానించి, 6 వేల కి.మీ పొడవైన పైప్‌లైన్ నిర్మాణం ద్వారా భారత్‌కు తీసుకొస్తారు.

మరిన్ని వార్తలు