ట్రైనీకి విమానం అప్పగించి పైలట్‌ కునుకు

8 May, 2017 00:27 IST|Sakshi
ట్రైనీకి విమానం అప్పగించి పైలట్‌ కునుకు

విధుల నుంచి తప్పించిన పాక్‌ ఎయిర్‌లైన్స్‌

లాహోర్‌: విమానాన్ని ట్రైనీ పైలట్‌కు అప్పగించి రెండున్నర గంటలపాటు ఓ సీనియర్‌ పైలట్‌ కునుకు తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికుడొకరు ఈ విషయాన్ని గుర్తించి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సదరు పైలట్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్‌ అధికారులు విచారణ ప్రారంభించారు. వివరాల్లోకెళితే పాక్‌కు చెందిన పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ) పీకే–785 విమానం 305 మంది ప్రయాణికులతో ఏప్రిల్‌ 26న ఇస్లామాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరింది. వీరిలో 293 మంది ఎకానమీ క్లాస్‌లో, 12 మంది బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారు.

ట్రైనీ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు కెప్టెన్‌ అమిర్‌ అక్తర్‌ హష్మీని నియమించుకున్న పీఐఏ, ఆయనకు జీతంగా నెలకు రూ.లక్ష చెల్లిస్తోంది. అయితే లండన్‌కు బయలుదేరిన కాసేపటికే శిక్షణలో ఉన్న పైలట్‌ అసద్‌ అలీకి విమానాన్ని అప్పగించిన ఆయన, చక్కగా బిజినెస్‌ క్లాస్‌లోకి వెళ్లి రెండున్నర గంటలు కునుకు తీశారు. ఈ సమయంలో విమానంలో ఫస్ట్‌ ఆఫీసర్‌గా ఉన్న హసన్‌ యజ్దానీ కాక్‌పిట్‌లో కూర్చుని ఉన్నారు. హష్మీ ఇంతకుముందు పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు.

దీంతో తొలుత చర్యలు తీసుకోవడానికి జంకినప్పటికీ, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయన్ను విధుల నుంచి తప్పించారు. మరోవైపు సుదూర ప్రయాణాల్లో పైలట్లు నిద్రపోవడం చాలా సాధారణమైన విషయమని హష్మీ మీడియాకు తెలిపారు. తాను విమానంలో రెండున్నర గంటలసేపు నిద్రపోయానన్నది వాస్తవం కాదన్నారు.

మరిన్ని వార్తలు