సయీద్‌ అరెస్టుకు సిద్ధం

5 Jul, 2019 03:22 IST|Sakshi

ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం ఆరోపణలతో అరెస్ట్‌ దిశగా పాక్‌

లాహోర్‌/న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా(జేయూడీ) చీఫ్‌ హఫీజ్‌ సయీద్, అతని ప్రధాన అనుచరులను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు పాకిస్తాన్‌లోని పంజాబ్‌ పోలీసులు గురువారం వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నారన్న ఆరోపణలపై సయీద్‌తోపాటు మరో 13 మంది జేయూడీ నేతలపై పాక్‌ కౌంటర్‌ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌ బుధవారం 23 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజే హఫీజ్‌ సయీద్‌తోపాటు కేసులు నమోదైన 13 మంది నేతలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పాక్‌ పోలీసులు ప్రకటించడం గమనార్హం. సయీద్‌ను అరెస్టు చేసేందుకు గాను పంజాబ్‌ పోలీసులు ‘పైస్థాయి’ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంలోని ఓ కీలకవ్యక్తి ఒకరు వెల్లడించారు.

సయీద్‌ ప్రస్తుతం లాహోర్‌ లోని జాహర్‌ పట్టణంలోని తన ఇంట్లో ఉన్నారని, ప్రభుత్వం నుంచి పచ్చజెండా రాగానే ఏక్షణమైనా పోలీసులు సయీద్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సదరు వ్యక్తి తెలిపారు. సయీద్‌ ఈ వారంలోనే అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉందనీ వివరించారు. ఉగ్రవాదాన్ని అదుపులో పెట్టే విషయమై ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) పాక్‌కు గతంలో పలుమార్లు చివాట్లు పెట్టింది. జూన్‌లోగా చర్యలు తీసుకోవాలంటూ ఎఫ్‌ఏటీఎఫ్‌ గతంలో విధించిన గడువును పాక్‌ ఉల్లఘించింది. దీంతో గడువును అక్టోబర్‌ వరకు పొడిగించిన ఎఫ్‌ఏటీఎఫ్‌.. ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని పాక్‌కు తేల్చిచెప్పింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే సయీద్‌ అరెస్టుకు పాకిస్తాన్‌ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద గ్రూపులపై నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుంటూ అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్‌ మోసగించడానికి ప్రయత్నిస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్‌ కుమార్‌ గురువారం మీడియాతో అన్నారు.

మరిన్ని వార్తలు