2022 నాటికి తొలి వ్యోమగామి అంతరిక్షంలోకి...

25 Jul, 2019 18:47 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : చైనా ఉపగ్రహాల సహాయంతో 2022లో తమ మొట్టమొదటి వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపుతామని పాకిస్తాన్‌ గురువారం వెల్లడించింది. ఈ క్రమంలో వ్యోమగామి ఎంపిక ప్రక్రియ 2020 ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. ఈ మేరకు...‘ అంతరిక్షంలో అడుగుపెట్టబోయే తొలి పాకిస్తానీ ఎంపిక 2020లో ప్రారంభిస్తాం. ఎంపిక ప్రక్రియలో భాగంగా యాభై మందిని షార్ట్‌లిస్ట్‌ చేస్తాం. క్రమేణా ఆ జాబితా 25 నుంచి ఒకటికి తగ్గి 2022 నాటికి అంతరిక్షం చేరుకునే మొదటి వ్యక్తిని పాక్‌ సగర్వంగా ప్రకటిస్తుంది. అంతరిక్ష పరిశోధనల్లో పురోగతి సాధించే విషయమై మా దేశంలో ఇదే అతిపెద్ద కార్యక్రమం. ఈ ప్రకటన చేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నా’ అని ఆ దేశ సాంకేతికాభివృద్ధి మంత్రి ఫవాద్‌ చౌదరి ట్వీట్ చేశారు.

అదే విధంగా ఈ ప్రయోగంలో వ్యోమగాముల ఎంపిక విషయంలో పాక్‌ వాయు సేన కీలక పాత్ర పోషిస్తుందని ఫవాద్‌ చౌదరి వెల్లడించారు. కాగా చంద్రుని మూలాలు కనుగొనే క్రమంలో భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. తద్వారా రష్యా, అమెరికా, చైనా దేశాల తర్వాత చంద్రుడిపై పరిశోధనలు చేసిన నాలుగో దేశంగా భారత్‌ ఖ్యాతి గడించింది. ఈ నేపథ్యంలో దాయాది దేశం తమ అంతరిక్ష ప్రయోగం గురించి ప్రకటన చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు