సర్జికల్ స్ట్రైక్స్ కాదు!: పాక్

30 Sep, 2016 02:17 IST|Sakshi
సర్జికల్ స్ట్రైక్స్ కాదు!: పాక్

కేవలం పరస్పర కాల్పులు జరిగాయి
భారత్ చెబుతున్నవన్నీ అబద్ధాలే
మా భూభాగంపై దాడులు చేస్తే.. మేమూ దాడి చేస్తాం
ప్రకటనలు చేసిన పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక దళం
దీటుగా ఎదుర్కొనేందుకు మేం సిద్ధం: పాక్ ప్రధాని షరీఫ్

ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమని పాకిస్తాన్ పేర్కొంది. అది పరస్పర కాల్పుల ఘటన మాత్రమేనని.. దానిని భారత్ సర్జికల్ దాడులుగా చెప్పుకొంటూ మీడియా హైప్‌ను సృష్టిస్తోందని పేర్కొంది. ఈ మేరకు గురువారం పాక్ సైన్యం, వాయుసేన ప్రకటనలు చేశాయి. ‘నియంత్రణ రేఖ దాటి భారత్ సర్జికల్ దాడులేమీ చేయలేదు. ఎప్పట్లాగే భారత్ కాల్పుల విరమణను ఉల్లంఘించి కాల్పులు జరిపింది. దీంతో సహజంగానే  పాక్ సైన్యం దీటుగా బదులిచ్చింది.

కానీ పాక్ అధీనంలోని భూభాగంలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయనే తప్పుడు ఉద్దేశాన్ని కల్పించేందుకే సర్జికల్ దాడులంటూ అవాస్తవ ప్రచారం మొదలుపెట్టింది’ అని పాక్ ఆర్మీ ఆరోపించింది. ఒక వేళ తమ భూభాగంపై భారత్ సర్జికల్ దాడులు చేస్తే.. అందుకు దీటుగా దాడులు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించింది. సర్జికల్ దాడుల పరిస్థితే వస్తే ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని వాయుసేన పేర్కొంది. బుధవారం రాత్రి భారత జవాన్లు  సాధారణ తుపాకులతో కాల్పులు జరిపారని, తమ సేనలు దీటుగా స్పందించాయని పాక్ రక్షణమంత్రి అసిఫ్ చెప్పారు.

 నిష్కారణంగా ఉల్లంఘన: షరీఫ్
నియంత్రణ రేఖ వెంబడి భారత్ నిష్కారణంగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని.. విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఇద్దరు సైనికుల మరణానికి కారణమైందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు.  నియంత్రణ రేఖ వద్ద ప్రస్తుత పరిస్థితి గురించిషరీఫ్, ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్‌తో చర్చించారు.
తమ భూభాగం సమగ్రతను సంరక్షించుకునేందుకు సాయుధ దళాలన్నీ సంసిద్ధంగా ఉన్నాయన్నారు.శాంతి, సామరస్యాల కోసం తాము చూపుతున్న సహనాన్ని తమ బలహీనతగా భావించొద్దని సూచించారు.పాక్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఎలాంటి కుట్రనైనా ఎదుర్కోగల సత్తా తమకు ఉందన్నారు. పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్జికల్ దాడుల ఘటన గురించి షరీఫ్‌కు నివేదికను సమర్పించారు. శుక్రవారం జరిగే పాక్ కేబినెట్ భేటీలో  తొలి అంశంగా కశ్మీర్‌లో పరిస్థితిని చర్చిస్తారు.

 ‘ఉడీ’కి రుజువులుగా కాగితం ముక్కే: ఉడీలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటివరకు భారత్ తమకు చిన్న కాగితం ముక్కను మాత్రమే ఆధారంగా సమర్పించిందనీ, రుజువులు లేకుండా తమని నిందిస్తోందని పాక్ ఆరోపించింది. ఉడీ దాడిపై భారత్ దర్యాప్తు కోసం వేచి ఉంటామనీ, సమాచారానికి, ఆధారానికి తేడా ఉంటుందని పాకిస్తాన్ విదే శాంగ శాఖ ప్రతినిధి అన్నారు. ‘భారత్ మాకు కాగితం ముక్క మాత్రమే ఇచ్చింది. ఇంతకు ముందు జరిగిన ఘటనల్లోనూ పాక్‌పై ఆరోపణలు చేసి కాగితం ముక్కలే ఇచ్చింది. వివరాల కోసం మేం నిరీక్షిస్తున్నాం’ అని విదేశాంగ ప్రతినిధి అన్నారు.

>
మరిన్ని వార్తలు