ఆధారాల కోసం భారత్ కు పాక్ లేఖ

30 Jun, 2016 19:52 IST|Sakshi
ఆధారాల కోసం భారత్ కు పాక్ లేఖ

ఇస్లామాబాద్: ఉగ్రవాద దాడుల కేసు దర్యాప్తులో పాకిస్థాన్ మరోసారి దాటవేత ధోరణి ప్రదర్శించింది. 26/11 ముంబై ముట్టడి కేసులో ఇప్పటికే భారత్ ఆధారాలు సమర్పించినా ఇంకా సాక్ష్యాలు కావాలని అంటోంది. ఈ కేసుకు సరైన పరిష్కారం దొరకాలంటే మరిన్ని ఆధారాలు సమర్పించాలని భారత్ ను కోరింది.

26/11 ముంబై దాడి కేసులో పాకిస్థాన్ ప్రమేయం ఉందని మోపిన అభియోగాలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని భారత్ కు తమ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌధురి లేఖ రాశారని విదేశాంగ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా వెల్లడించారు. ఈ కేసుకు సరైన ముగింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇస్లామాబాద్ ఉందని తెలిపారు. లేఖలోని మిగతా వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

2008, నవంబర్ లో ముంబై లో జరిగిన దాడులతో సంబంధముందన్న ఆరోపణలతో ఏడుగురు లష్కరే-ఇ-తోయిబా తీవ్రవాదులను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. వీరిలో ప్రధాన కుట్రదారుడు జకివుర్ రెహ్మాన్ ను బెయిల్ పై విడుదల చేసింది. మిగతా ఆరుగురు రావల్పిండి జైల్లో ఉన్నారు.

మరిన్ని వార్తలు