హఫీజ్‌కు పాక్‌ బిగ్‌ షాక్‌

13 Feb, 2018 10:27 IST|Sakshi
హఫీజ్‌ సయ్యద్‌ (పాత చిత్రం)

ఇస్లామాబాద్‌ : ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కర్‌-ఇ-తాయిబా చీఫ్‌ హఫీజ్‌ సయ్యద్‌ పాకిస్థాన్‌ పెద్ద షాక్‌ ఇచ్చింది. హఫీజ్‌ను ఉగ్రవాదిగా గుర్తిస్తూ... అతనికి చెందిన సంస్థలపై నిషేధం విధించింది. 

గతంలో ఐక్యరాజ్యసమితి హఫీజ్‌కు చెందిన లష్కర్‌-ఇ-తాయిబా, జమాత్ ఉద్ దవా లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలోనే నిధుల సేకరణ అనుమతికి నిరాకరించిన పాక్‌.. ఇప్పుడు పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. 1997 ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సవరణలు చేసి మొత్తం 27 సంస్థలను ఉగ్రవాద జాబితాలో జత చేర్చింది.
గత వారమే అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్‌ ఆర్డినెన్స్‌ పై సంతకం చేసినప్పటికీ.. సోమవారం ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. 

తక్షణమే ఈ నిషేధం అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. అయితే హఫీజ్‌ను అరెస్ట్‌ చేసే విషయంపై మాత్రం పాక్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ​

కాగా, 26/11 ముంబై దాడులకు హఫీజ్‌ ప్రధాన సూత్రధారి. అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా హఫీజ్‌గా గుర్తించి అతనిపై 10 మిలియన్‌ డాలర్ల నజరానాను కూడా ప్రకటించింది. ఐరాస ఒత్తిడి మేరకు 297 రోజులపాటు అతన్ని గృహ నిర్భందం చేసిన పాక్‌ ప్రభుత్వం, లాహోర్‌ కోర్టు ఆదేశాల మేరకు చివరకు విడుదల చేయాల్సి వచ్చింది. పాక్‌ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్న తరుణంలో హఫీజ్‌కు తాజా నిర్ణయం ఊహించని దెబ్బే.

మరిన్ని వార్తలు