ఇలా తల తిప్పడం ఎవరికి సాధ్యం?

9 Nov, 2017 13:59 IST|Sakshi

సాక్షి, కరాచి : ఎవరైనా వెనక్కి తిరిగి చూడాలంటే మనిషే పూర్తిగా వెనక్కి తిరిగి చూస్తారు. అలా మనిషి కాకుండా తలను మాత్రమే తిప్పి చూడాలంటే 90 డిగ్రీల వరకు తలను తిప్పి చూడగలరు. అంతకుమించి తిప్పడం ఎవరికి సాధ్యపడదు. కానీ కరాచీ నగరానికి చెందిన మన 14 ఏళ్ల ముహమ్మద్‌ సమీర్‌ తన తలను 180 డిగ్రీలు వెనక్కి తిప్పి చూడగలరు. వెనక్కి తిరక్కుండానే తన తలను భూజాల మీదుగా పూర్తిగా వెనక్కి తిప్పగలరు. ఎలాగంటే గుడ్లగూబ లాగ. కాకపోతే చేతుల ఆసరాతో. ఈ అరుదైన విద్యను సమీర్‌ చాలా కష్టపడే నేర్చుకున్నారు.

తండ్రి జబ్బు పడడంతో సమీర్‌ తన అరుదైన విద్యను ఆసరాగా చేసుకొని జీవనోపాధి వెతుక్కున్నారు. డ్యాన్స్‌ కూడా నేర్చుకున్న సమీర్‌ 8 మంది సభ్యులుగల ‘డేంజరస్‌ బాయ్స్‌’ డ్యాన్స్‌ బృందంలో చేరారు. డ్యాన్స్‌కు తన తిప్పుడును జోడించడంతో బృందంలో ప్రత్యేకంగా రాణిస్తున్నారు. ‘అమ్మో! సమీర్‌ వెనక్కి పూర్తిగా తల తిప్పడం చూసి మొదట దిగ్భ్రాంతి చెందాను. నిజంగా అది అద్భుతమే’ అని బృందంలోని లీడింగ్‌ డ్యాన్సర్‌ అశర్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు.

ఇదే విషయమై సమీర్‌ను ప్రశ్నించగా ‘నాకు ఆరేడేళ్లు ఉన్నప్పుడు ఓ హాలీవుడ్‌ హార్రర్‌ చిత్రంలో ఓ పాత్ర ఇలా తన తలను 180 డిగ్రీలు వెనక్కి తిప్పడం చూశాను. అది ఎందుకో నాకు బాగా నచ్చింది. అలా తలతిప్పడాన్ని రోజూ ప్రాక్టీసు చేస్తూ వచ్చాను. కొన్ని నెలల్లోనే నేను విజయం సాధించాను. ఒకరోజు అలా ప్రాక్టీసు చేస్తూ మా అమ్మ కంట్లో పడ్డాను. అప్పుడు నెత్తిమీది నుంచి ఒక్కటిచ్చుకున్న మా అమ్మ, ఇంకెప్పుడు అలా చేయవద్దని, మెడ విరుగుతుందని తిట్టారు. అప్పటి నుంచి ఆమెకు తెలియకుండా ప్రాక్టీసు చేస్తూ వచ్చాను.

ఆ తర్వాత నా మిత్రులు, ఇరుగుపొరుగువారు నా విద్యను చూసి ప్రశంసిస్తూ వచ్చారు. అదే అతని బతుకుతెరువుకు దారి చూపింది. జౌళీ పరిశ్రమలో పనిచేస్తున్న సమీర్‌ తండ్రి రెండుసార్లు గుండెపోటు రావడంతో మంచంపట్టారు. అప్పటి నుంచి సమీర్‌ డ్యాన్స్‌ బృందంలో చేరి ప్రదర్శనలు ఇస్తున్నారు. రోజుకు ఆరు నుంచి పది పౌండ్ల వరకు, నెలకు వంద నుంచి 120 పౌండ్ల వరకు సంపాదిస్తున్నారు. 

మరిన్ని వార్తలు