బెగ్గింగ్‌ కాదు.. బీజింగ్‌!

6 Nov, 2018 10:49 IST|Sakshi

ఇస్లామాబాద్‌: అక్షరాలు, పదాలు తారుమారైతే అర్థాలే మారిపోతాయి.. అంతేకాకుండా పెడర్థాలకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాంటి సమస్యనే ఓ మీడియా సంస్థ ఎదుర్కొంటోంది. వారి దేశ ప్రధాని వార్తలోనే ఘోర తప్పిదం చేయడంతో అపప్రదను మూటగట్టుకుంటోంది పాకిస్తాన్‌ టెలివిజన్‌ కార్పొరేషన్‌ (పీటీవీ) మీడియా సంస్థ .  పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చైనా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన చేసిన ప్రసంగాన్ని పీటీవీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయితే డేట్‌లైన్‌ బీజింగ్‌లో ప్రధాని అని కాకుండా బెగ్గింగ్‌లో ప్రధాని అంటూ తప్పుగా ప్రసారం చేసింది . 

ఇలా 20 సెకన్ల పాటు ప్రసారం అయింది. ఆ వెంటనే తప్పు గుర్తించి సరి చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇది పాక్‌ ప్రధానికి, దేశానికి ఎంతో అవమానకరమని కొంత మంది నెటిజన్లు మండిపడగా మరికొంతమంది వినూత్నంగా స్పందించారు. ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని.. దీనిపై ప్రత్యేక మిలటరీ అధికారులతో దర్యాప్తు జరిపించాలని చురకలు అంటిస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు కూడా ‘అవును మన ప్రధాని చైనా ప్రభుత్వం ముందు బెగ్గింగ్‌ చేస్తున్నారు’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. 

వివరణ ఇచ్చిన పీటీవీ
‘పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చైనా పర్యటనలో చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేయడంలో పొరపాటు దొర్లింది. డేట్‌లైన్‌ బీజింగ్‌ బదులు బెగ్గింగ్‌ అని తప్పుగా వచ్చింది. ఇది తెరపై 20 సెకన్ల పాటు కనబడింది. తర్వాత తొలగించారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం’అంటూ పీటీవీ సంస్థ వివరణ ఇచ్చింది. ఇక దీనిపై సర్వత్రా విమర్శలు రావటంతో ఈ ఘటనపై విచారణ జరపాలని పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు