భారత్‌ ప్రకటనపై పాక్‌ ఆగ్రహం

24 Sep, 2019 16:17 IST|Sakshi
బిపిన్‌ రావత్‌ (ఫైల్‌ఫోటో)

బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యలను ఖండించిన పాక్‌

ఇస్లామాబాద్‌: బాలాకోట్‌ ఉగ్రశిబిరాలపై భారతవైమానిక దళాల దాడితో ధ్వంసమైన పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలు తిరిగి ప్రారంభమయ్యాయని భారత సైనికాధిపతి బిపిన్‌రావత్‌ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్‌ ఖండించింది. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు భారత్‌ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తోందంటూ ఆ దేశ విదేశాంగ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన నుంచి దేశ ప్రజలను, ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకు ఢిల్లీ ఇలాంటి కార్యక్రమాలకు ఒడిగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌ చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవని పాక్‌ స్పష్టం చేసింది.

పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో ధ్వంసమైన బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్‌ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని బిపిన్‌రావత్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏడు నెలలక్రితం బాలాకోట్‌పై భారత్‌ దాడితో ఉగ్రవాదులు అక్కడినుంచి వెళ్ళిపోయారని తెలిపారు. తిరిగి మళ్ళీ పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు బాలాకోట్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించారని ఆయన వెల్లడించారు. గతంలో జరిపిన దాడికి మించి ఈసారి దాడులు చేసే అవకాశముందన్నారు. మంచుకరుగుతున్న ప్రాం తాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తరభాగంనుంచి భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మరవచ్చుననీ రావత్‌ స్పష్టం చేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా