సయీద్‌కు 11 ఏళ్ల జైలు

13 Feb, 2020 03:49 IST|Sakshi

లాహోర్‌: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా అధ్యక్షుడు హఫీజ్‌ సయీద్‌కు పాక్‌లో జైలు శిక్ష పడింది. ఉగ్రవాదానికి నిధులు అందించారన్న కేసులో విచారణ జరిపిన పాకిస్తాన్‌లోని ఉగ్రవ్యతిరేక (ఏటీసీ) పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. సయీద్‌తోపాటు అతడి సన్నిహిత సహచరుడు జఫర్‌ ఇక్బాల్‌కూ 11 ఏళ్ల శిక్ష విధిస్తూ ఏటీసీ జడ్జి అర్షద్‌ హుస్సేన్‌ భుట్టా ఆదేశాలు జారీ చేశారు. సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గతంలోనే ప్రకటించింది. అతడి తలకు అమెరికా గతంలో కోటి డాలర్ల వెలకట్టింది. గత ఏడాది జూలై 17న అరెస్ట్‌ అయిన సయీద్‌ లాహోర్‌లోని కోట్‌ లఖ్‌పత్‌ జైల్లో ఉన్నారు.

లాహోర్, గుజ్రన్‌వాలాల్లో దాఖలైన రెండు కేసుల్లో సయీద్‌కు శిక్ష విధించారని, ఒక్కో కేసులో ఐదున్నర ఏళ్లు జైలు శిక్ష, మొత్తం 15 వేలరూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని, రెండు శిక్షలు ఒకేసారి అమలవుతాయని కోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఏటీసీ కోర్టు గత ఏడాది డిసెంబర్‌ 11న సయీద్, అతడి సన్నిహిత సహచరులను దోషులుగా ప్రకటించగా..శిక్ష ఖరారును ఫిబ్రవరి 11వ తేదీ వరకూ వాయిదా వేయడం తెల్సిందే. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పాకిస్తాన్‌ హామీని నెరవేర్చాలని పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఒకటి ఇచ్చిన పిలుపుతో పాక్‌ ప్రభుత్వం సయీద్, అతడి అనుచరులపై విచారణ ప్రారంభించింది.

మరిన్ని వార్తలు