పాక్‌ వక్రబుద్ధి.. మోదీ విమానానికి 'నో'

27 Oct, 2019 19:07 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మరోసారి తన వక్ర బుద్దిని చాటుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ  సౌదీ అరేబియా పర్యటన నేపథ్యంలో భారత్‌ చేసిన అభ్యర్థనను పాక్‌ తోసిపుచ్చింది.  మోదీ ప్రయాణం చేసే విమానాన్ని తమ గగనతలం మీదుగా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్‌లో మానవహక్కులను ఉల్లఘించిదన్న కారణాన్ని సాకుగా చూపిస్తూ పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ స్వయంగా మీడియాకు వెల్లడించారు.

అనుమతి నిరాకరణకు సంబంధించిన విషయాన్ని లిఖిత పూర్వకంగా భారత హైకమిషనర్‌కు తెలియజేయనున్నట్లు ఖురేషీ తెలిపారు. మరోవైపు కశ్మీరీలకు మద్దతుగా ఈరోజు పాక్‌ బ్లాక్‌డే నిర్వహిస్తోంది. అంతర్జాతీయ బిజినెస్‌ ఫోరంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సోమవారం సౌదీ పర్యటనకు వెళ్లనున్నారు.  దీంతోపాటు పలువురు సౌదీ నేతలను కూడా  కలవనున్నారు.

గత నెలలో మోదీ అమెరికా పర్యటన, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐస్‌ల్యాండ్‌ పర్యటన సందర్భాల్లోనూ పాక్‌ ఇదే రీతిలో వ్యవహరించింది. బాలాకోట్‌ దాడుల తర్వాత తన గగనతలాన్ని మూసివేసిన పాక్‌ కొంతకాలం తర్వాత మళ్లీ తెరిచింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పాక్‌ భారత్‌కు చెందిన విమానాలను రానీయకుండా తమ గగనతలాన్ని మరోసారి మూసివేసింది.  

>
మరిన్ని వార్తలు