నిర్బంధంలో అజహర్‌ కొడుకు, సోదరుడు

6 Mar, 2019 04:48 IST|Sakshi

కాపాడేందుకే అరెస్టులన్న భారత్‌

ఇస్లామాబాద్‌: ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ పాకిస్తాన్‌ కొరడా ఝుళిపించింది. జైషే చీఫ్‌ మసూద్‌ అజహర్‌ కొడుకు, సోదరుడు సహా నిషేధిత సంస్థలకు చెందిన మొత్తం 44 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకుంది. విచారణ నిమిత్తం జైషే చీఫ్‌ కొడుకు హమద్‌ అజహర్, సోదరుడు ముఫ్తీ అబ్దుల్‌ రవూఫ్‌ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నామని పాక్‌ హోం శాఖ వెల్లడించింది.  

అరెస్ట్‌ కాదు..: భారత్‌
ఈఅరెస్టులపై భారత్‌ స్పందించింది. వారిని ఉగ్రవాద వ్యతిరేక చట్టాల ప్రకారం అరెస్టు చేయలేదని, వారికి భద్రత కల్పించి కాపాడేందుకేనని భారత భద్రతా దళాధికారి ఒకరు పేర్కొన్నారు.  

నిషేధిత జాబితాలో జమాతే–ఉద్‌–దవా
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయిద్‌ నేతృత్వంలోని జమాత్‌–ఉద్‌–దవా, దాని అనుబంధ సంస్థ ఫాలా–ఈ–ఇన్సానియత్‌ ఫౌండేషన్‌ను పాక్‌ నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ రెండు సంస్థలు వాచ్‌లిస్ట్‌లోనే ఉన్నాయని భారత మీడియాలో వార్తలు వచ్చిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ  సమాచారం ప్రకారం  జమాత్, ఫాలాతో కలుపుకుని మొత్తం 70 సంస్థలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. జమాతే, ఫాలా సంస్థల ఆస్తుల్ని స్థంభింపజేసినట్లు పాక్‌ ఇది వరకే ప్రకటించింది. హఫీజ్‌ సయీద్‌ను అమెరికా 2012లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, అతని సమాచారం తెలిపిన వారికి 10 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించింది. 

మరిన్ని వార్తలు