పాక్ సైన్యం చేతిలో చైనా ఎటాక్ హెలికాప్టర్లు

17 Nov, 2016 16:20 IST|Sakshi
పాక్ సైన్యం చేతిలో చైనా ఎటాక్ హెలికాప్టర్లు
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా.. పాకిస్థాన్‌తో చైనా చేయి కలిపిందన్న విషయం మరోసారి స్పష్టంగా తేలిపోయింది. ప్రస్తుతం భారతదేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ చేస్తున్న సైనిక విన్యాసాలలో.. చైనా తయారీ డబ్ల్యుజడ్-10 థండర్‌బోల్ట్ ఎటాక్ హెలికాప్టర్లు కనిపించడం అందుకు నిదర్శనం. ఇప్పటివరకు ఆ తరహా హెలికాప్టర్లను తాము కొనుగోలు చేస్తున్నట్లు ఎక్కడా చెప్పని పాకిస్థాన్.. ఒకేసారి వాటిని ప్రదర్శించి చూపించింది. వీటిద్వారా మిసైళ్లను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ఇవి ధ్వంసం చేయగలవు. అమెరికా తయారుచేసిన ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ల సామర్థ్యంతో ఇవి సమానమైనవి. అపాచీ హెలికాప్టర్లను గల్ఫ్‌ యుద్ధం సమయాల్లోను, అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులపై యుద్ధం సమయంలోను విస్తృతంగా ఉపయోగించారు. అమెరికాతో కుదిరిన సైనిక ఒప్పందంలో భాగంగా గత సంవత్సరం భారతదేశం 310 కోట్ల డాలర్లతో మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లకు ఆర్డర్ చేసింది. అవి ఇంతవరకు మనకు రాలేదు గానీ, ఈలోపే చైనా మాత్రం పాకిస్థాన్‌కు అదే తరహా హెలికాప్టర్లు ఇచ్చేసింది. 
 
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ పంజాబ్ రాష్ట్రంలోని బహావల్పూర్ వద్ద పొరుగు దేశం సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే తమ సైనిక బలగాలు ఎంత సన్నద్ధంగా ఉన్నాయో తెలుసుకోడానికి ఈ విన్యాసాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ కూడా వీటిని చూస్తున్నారు. 
 
డబ్ల్యుజడ్-10 హెలికాప్టర్లు చైనా సైన్యం అమ్ములపొదిలో 2012 నుంచి ఉన్నాయి. వాటిలో ముందుగా మూడు చాపర్లను అవి ఎలా పనిచేస్తున్నాయో చూసేందుకు పాకిస్థాన్‌కు గత సంవత్సరం ఇచ్చారు. ఇవి తమ అవసరాలకు సరిపోయేలా ఉన్నాయా లేవా అన్న విషయమై గానీ, అసలు ఇవి మతకు వచ్చినట్లు గానీ పాకిస్థాన్ ఇంతవరకు అధికారికంగా ఎప్పుడూ చెప్పలేదు. ప్రస్తుతం వీటికి ఉన్న ఇంజన్ల సామర్థ్యం అంత సరిగా లేకపోవడంతో సరికొత్త ఇంజన్‌ను చైనా సిద్ధం చేస్తోంది. దాని సాయంతో ఈ హెలికాప్టర్ దాదాపు 16 ఏఆర్-1 గైడెడ్ యాంటీ ట్యాంక్ మిసైళ్లను మోసుకుపోగలదు.
Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు