చంద్రయాన్‌-2పై పాక్‌ వ్యోమగామి ప్రశంసలు

9 Sep, 2019 17:49 IST|Sakshi

కరాచీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2పై పాకిస్తాన్‌కు చెందిన తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీమ్‌ అభినందనలు తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసేందుకు ఇస్రో చేసిన ప్రయత్నం చరిత్రాత్మకమైందని అన్నారు. కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న సైంటియా అనే సైన్స్‌ మ్యాగజైన్‌తో నమీరా మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్‌-2ను దక్షిణ ఆసియా సాధించిన విజయంగా ఆమె అభివర్ణించారు. ఇది ప్రపంచ అంతరిక్ష రంగానికి గర్వకారణమని చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రాంతీయ అభివృద్ధికి దక్షిణ ఆసియాకు చెందిన ఏ దేశం విజయం సాధించినా.. అది ఆ ప్రాంతం మొత్తానికి గర్వకారణమని చెప్పుకొచ్చారు. కాగా, ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌ పంపే వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు నమీరా ఎంపికయ్యారు.

ఇదిలా ఉంచితే చంద్రయాన్‌-2 ప్రయోగంపై పాక్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫవాద్‌ వ్యాఖ్యలపై భారత నెటిజన్లతోపాటు పలువురు పాకిస్తానీలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడివైపు నెమ్మదిగా కదిలింది. మరో 2.1 కి.మీ ప్రయాణిస్తే ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందనగా, భూకేంద్రంతో ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షింతగానే ఉందని ఇస్రో తాజాగా ప్రకటించింది. ‘విక్రమ్‌’ హార్డ్‌ ల్యాండింగ్‌ అయినప్పటికీ.. అది ముక్కలు కాలేదని ఇస్రో తెలిపింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు