జాధవ్‌ను కలిసేందుకు అనుమతించిన పాక్‌ 

2 Sep, 2019 08:08 IST|Sakshi

ఇస్లామాబాద్‌: మరణశిక్ష పడి పాక్‌ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌(49)ను దౌత్యాధికారులు కలుసుకు నేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాక్‌ ప్రకటించింది. ‘కుల్‌భూషణ్‌ జాధవ్‌ను సెప్టెంబర్‌ 2వ తేదీన భారత దౌత్య అధికారులు కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి మొహ మ్మద్‌ ఫైసల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ విషయమై చర్చలు జరిగిన ఆరు నెలల తర్వాత పాక్‌ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం. గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్‌ జాధవ్‌కు విధించిన మరణ దండనను జూలై 18న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా కులభూషణ్‌ విషయంలో పాక్‌ వ్యవహరించిన తీరును ఐసీజే తీవ్రంగా తప్పుబట్టింది. వియాన్నా ఒప్పందం ప్రకారం కులభూషణ్‌ జాధవ్‌ను కలిసేందుకు దౌత్యాధికారులకు అనుమతిని పాక్‌ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు 15 రోజుల అనంతరం పాక్‌ దిగొచ్చింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియాన్నా ఒప్పందంలోని ఆర్టికల్‌ 36, పారాగ్రాఫ్‌ 1 (బీ) ప్రకారం కులభూషణ్‌కు తన హక్కులు తెలియజేశామని, బాధ్యతాయుతమైన దేశంగా ఆయనను కలిసేందుకు దౌత్యాధికారుల అనుమతిని జారీచేశామని పాక్‌ విదేశాంగ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం భారత దౌత్యాధికారులు జాదవ్‌ను కలుసుకోనున్నారు. 

మరిన్ని వార్తలు