ఐసీజేకు వెళ్లినా ప్రయోజనం లేదు: పాక్‌ లాయర్‌

3 Sep, 2019 14:56 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : కశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) ఆశ్రయించాలని భావిస్తున్న పాకిస్తాన్‌ ఆశలపై ఆ దేశ ఐసీజే న్యాయవాది ఖవార్‌ ఖురేషి నీళ్లు చల్లారు. జమ్మూ కశ్మీర్‌లో మారణహోమం జరుగుతుందన్న ఆరోపణలకు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం వద్ద సరైన సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు. న్యాయస్థానం సాక్ష్యాధారాలనే ప్రామాణికంగా తీసుకుంటుందని.. అలాంటి పక్షంలో కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌ కోర్టును ఆశ్రయించినా పెద్దగా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన నాటి నుంచి దాయాది దేశం భారత్‌పై విద్వేషపూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు పాక్ శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. అగ్రరాజ్యం అమెరికా సహా రష్యా కశ్మీర్‌ అంశంలో భారత్‌ను సమర్థించాయి. దీంతో కంగుతిన్న పాకిస్తాన్‌ తన మిత్రదేశమైన చైనా సహాయంతో ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌ అంశాన్ని చర్చించే దిశగా పావులు కదిపింది. 

ఈ క్రమంలో చైనా జోక్యంతో యూఎన్‌ భద్రతా మండలిలో రహస్య సమావేశం జరిగేలా చేసింది. అయితే యూఎన్‌ శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, యూకే ఇది భారత్‌-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేయడంతో పాక్‌కు చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల  యుద్ధ క్షిపణిని పరీక్షించిన పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం విదితమే. అదే విధంగా తమ వద్ద మినీ అణుబాంబులు ఉన్నాయని.. తక్కువగా అంచనా వేయొద్దని ఆ దేశ మంత్రులు బీరాలు పలుకుతున్నారు. ఇక తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. అణ్వాయుధ దేశాలైన భారత్‌- పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమిస్తుందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరితే పరిస్థితి చేయి దాటి పోతుందని.. అయితే పాకిస్తాన్‌ మాత్రం ఎన్నటికీ యుద్ధాన్ని ప్రారంభించబోదని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు