కుప్పకూలిన పాక్‌ విమానం

23 May, 2020 04:23 IST|Sakshi
ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడి ఉన్న విమాన శకలాలు. (ఇన్‌సెట్‌లో) క్షతగాత్రులను తరలిస్తున్న దృశ్యం

విమానంలో 99 మంది

57 మృతదేహాల వెలికితీత

కరాచీ: పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీలో శుక్రవారం మధ్యాహ్నం జనావాస ప్రాంతంలో ప్రయాణికుల విమానం కుప్పకూలింది. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన ఈ విమానంలో మొత్తం 99 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎంతమంది చనిపోయారనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఘటనాస్థలం నుంచి 57 మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. బ్యాంక్‌ ఆఫ్‌ పంజాబ్‌ ప్రెసిడెంట్‌ జఫర్‌ మసూద్‌ సహా ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కరోనా లాక్‌డౌన్‌ అనంతరం పాకిస్తాన్‌లో గతవారమే పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను పునఃప్రారంభించారు.

ల్యాండింగ్‌ గేర్‌లో సమస్య  
లాహోర్‌ నుంచి వస్తున్న పీకే–8303 విమానం మరికొద్ది క్షణాల్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్‌ కానుండగా, విమానాశ్రయం పక్కనే ఉన్న జిన్నా గార్డెన్‌ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ పీఐఏ ఎయిర్‌బస్‌ ఏ320 విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 31 మంది మహిళలు, 9మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ల్యాండింగ్‌ గేర్‌లో సమస్య ఏర్పడిందని కూలిపోవడానికి కాసేపటి ముందు పైలట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారమిచ్చారు.

ఈ ఘటనపై పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ, ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రధాని ఇమ్రాన్‌ అధికారులను ఆదేశించారు. తక్షణమే సహాయ చర్యల్లో పాలు పంచుకోవాలని ఆర్మీని జనరల్‌ బజ్వా ఆదేశించారు. విమానం కూలిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమైన దృశ్యాలను స్థానిక వార్తా చానళ్లు ప్రసారం చేశాయి.

ధ్వంసమైన ఇళ్లలో నుంచి పలు మృతదేహాలను వెలికితీశామని పోలీసులు, సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న సిబ్బంది తెలిపారు. అలాగే, పలువురు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామన్నారు. కనీసం 25 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.  కాగా, విమానంలో ఎంతమంది ఉన్నారనే విషయంలో అధికారులు వేర్వేరు రకాలైన సమాచారం ఇచ్చారు. అయితే, 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని  పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ) అధికార ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్‌ వెల్లడించారు.

మధ్నాహ్నం 2.37 గంటల సమయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు నిలిచిపోయాయని హఫీజ్‌ తెలిపారు. సాంకేతిక సమస్య ఏర్పడిందన్న పైలట్‌ సజ్జాద్‌ గుల్‌తో.. ల్యాండింగ్‌కు రెండు రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని కంట్రోల్‌ టవర్‌ అధికారులు చెప్పారని పీఐఏ చైర్మన్‌ అర్షద్‌ మాలిక్‌ తెలిపారు. కూలే ముందు విమానం రెక్కల్లో నుంచి మంటలు వచ్చాయని, ఆ తరువాత క్షణాల్లోనే అది ఇళ్లపై కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
 

మరిన్ని వార్తలు