లాబీయిస్ట్ కోసం పాక్ వెతుకులాట!

28 Jun, 2016 12:59 IST|Sakshi
లాబీయిస్ట్ కోసం పాక్ వెతుకులాట!

ఇస్లామాబాద్: అమెరికాతో తమ దేశం తరఫున దౌత్యం నడపడానికి పాకిస్తాన్‌కు ఓ లాబీయిస్ట్ కావాలట. ఎఫ్-16 యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు అమెరికా తిరస్కరించడం, ఎన్‌ఎస్‌జీ (అణు సరఫరాదారుల కూటమి)లో భారత్ సభ్యత్వానికి యూఎస్ బహిరంగంగా మద్దతు తెలిపిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పరచుకునేందుకు కొత్త లాబీయిస్ట్ కోసం పాక్ వెతుకులాట ప్రారంభించింది. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లను ఎదుర్కొనే విషయంలో విభేదాలు తలెత్తడం, దేశంలోని ఉగ్రవాద గ్రూపులను రూపుమాపడంలో పాక్ విఫలమైందని అమెరికా ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఓ పెయిడ్ లాబీయిస్ట్ కోసం వెతుకులాడుతున్నట్లు వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి నదీమ్ హొతియానా ధ్రువీకరించారని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ‘డాన్’ పత్రిక పేర్కొంది. కాగా, తమ దేశం కోసం అమెరికాతో లాబీయింగ్ చేసేందుకు 2008లో ‘లోక్ లార్డ్ స్ట్రాటజీస్’తో ఒప్పందం చేసుకున్న పాక్ ప్రభుత్వం.. 2013 తర్వాత దాన్ని పొడిగించలేదు.

మరిన్ని వార్తలు