మసూద్‌ బతికేఉన్నాడు : పాక్‌ మీడియా

4 Mar, 2019 08:10 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ మరణించలేదని, ఆయన సజీవంగా ఉన్నారని పాకిస్తాన్‌ మీడియా వెల్లడించింది. మసూద్‌ మరణించాడన్న ప్రచారం అవాస్తవమని జియో ఉర్ధూ న్యూస్‌ పేర్కొంది. జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో తీవ్రంగా గాయపడి మరణించాడని, కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆయన మరణించాడంటూ విభిన్న కథనాలు వెల్లడైన నేపథ్యంలో మసూద్‌ సజీవంగా ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారని జియో న్యూస్‌ తెలిపింది.

పాక్‌ ప్రభుత్వం నుంచి మసూద్‌ పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదని, ఈ క్షణంలో ఏం జరిగిందనేది తనకు తెలియదని పాక్‌ సమాచార మంత్రి ఫవాద్‌ చౌధరి పేర్కొనడం గమనార్హం. కాగా, మసూద్‌ తీవ్ర అనారోగ్యంతో ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే అంశం మినహా తమకు ఎలాంటి సమాచారం లేదని భారత అధికారులు స్పష్టం చేశారు. (ఉగ్ర మసూద్‌ మృతి?)

మరోవైపు మసూద్‌ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారని పాక్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్‌ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఆయన నిర్ధారించినట్లయ్యింది. తమ భూభాగంలోనే మసూద్‌ ఉన్నాడని పాకిస్తాన్‌ అంగీకరించడం అదే తొలిసారి కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు