బడ్జెట్‌పై పాక్‌ ఆర్మీ అనుహ్య నిర్ణయం

5 Jun, 2019 16:39 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ఆర్మీ అనుహ్య నిర్ణయం తీసుకుంది. తమకు కేటాయించే రక్షణ బడ్జెట్‌ను తగ్గించుకుంటున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించింది. దేశంలోని ఆర్థిక సంక్షోభాన్ని ఎదురుకోవడానికి పాక్‌ ప్రభుత్వం చేపట్టిన పొదుపు చర్యల్లో పాలుపంచుకోవడం కోసమే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ మంగళవారం ట్విటర్‌లో ఒక సందేశాన్ని ఉంచారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను డిఫెన్స్‌ బడ్జెట్‌ తగించుకుంటున్నట్టు తెలిపారు. అయితే దేశ రక్షణ, భద్రత అంశాల్లో రాజీ పడే సమస్యే లేదన్నారు. బడ్జెట్‌లో కోత వల్ల కలిగే ఇబ్బందులను అంతర్గంతంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. గిరిజన ప్రాంతాలు, బెలూచిస్తాన్‌ అభివృద్ధిలో భాగం కావడం చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. 

మరోవైపు పాక్‌ మిలటరీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రశంసించారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మిలటరీ స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. భద్రత పరంగా పాక్‌ అనేక సవాళ్లను ఎదురుకుంటున్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయని అన్నారు. ఈ నిధులను గిరిజన ప్రాంతాలు, బెలూచిస్తాన్‌ అభివృద్ధి కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు. గతేడాది పాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్‌ ఖాన్‌.. పొదుపు మంత్రం జపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని అధికారిక నివాసాన్ని కాదనుకొని త్రీ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.

>
మరిన్ని వార్తలు