న్యూయార్క్‌లో పాక్‌కు షాక్‌

27 Sep, 2019 11:35 IST|Sakshi

పాక్‌కు వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో గళమెత్తిన ఆ దేశ మైనారిటీలు

న్యూయార్క్‌ వీధుల్లో పెద్ద ఎత్తున ప్రచారం

న్యూయార్క్‌: అమెరికా రాజధాని న్యూయార్క్‌లో శుక్రవారం ఉదయం రద్దీ వీధుల్లో, రహదారులపై.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రకటనలు దర్శనమిచ్చాయి. పాకిస్థాన్‌లో మైనారిటీలపై సాగుతున్న అరాచకాలు, అణచివేతపై గళమెత్తుతూ.. ట్యాక్సీలు, ట్రక్కులపై భారీ డిజిటల్‌ డిస్‌ప్లే ప్రకటనలు కనిపించాయి. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగించనున్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఒక్కసారిగా ఈ ప్రచారం హోరెత్తడం గమనార్హం. అమెరికాకు చెందిన హక్కుల సంస్థ వాయిస్‌ ఆఫ్‌ కరాచీ ఆధ్వర్యంలో పాక్‌ మైనారిటీల కోసం గళమెత్తుతూ న్యూయార్క్‌లో ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయం సమీపంలో ఈ ట్రక్కులు, ట్యాక్సీలు తిరుగుతూ కనిపించాయి. ‘ఐరాస ప్రవచించిన మానవ హక్కులు పాకిస్థాన్‌లో ఏమాత్రం అమలవ్వడం లేదు. పాక్‌ విషయంలో ఐరాస జోక్యం చేసుకోవాలని మొహజిర్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు’ అని ప్రకటనల్లో ఉంది. మైనారిటీలైన మొహజిర్స్‌కు పాక్‌లో ఎలాంటి హక్కులు కల్పించడం లేదని, తమకు ఎదురవుతున్న అన్యాయాలు, అణచివేతపై కనీసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా మొహజిర్స్‌ను అనుమతించడం లేదని, ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం, ఐరాస జోక్యం కోరుతూ ఈ ప్రచారం ప్రారంభించామని కరాచీ మాజీ మేయర్‌ వసే జలీల్‌ తెలిపారు.


 

మరిన్ని వార్తలు