ఇఫ్తార్‌ అతిథులకు పాక్‌ వేధింపులు

3 Jun, 2019 04:16 IST|Sakshi
సెరేనా హోటల్‌ వద్ద ఇఫ్తార్‌కు వస్తున్న అతిథులను అడ్డుకుంటున్న పాక్‌ భద్రతా సిబ్బంది

హోటల్‌ సెరేనాలో భారత హైకమిషన్‌ ఇఫ్తార్‌ విందు

అతిథులు రాకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన పాక్‌

భారత్‌ ఆగ్రహం.. విచారణ జరపాలని డిమాండ్‌

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ శనివారం ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు పాక్‌ రాజకీయ, వాణిజ్య, మీడియా ప్రముఖులు రాకుండా నానా అడ్డంకులు సృష్టించింది. ఈ విందుకు వెళ్లరాదని పలువురు ప్రముఖులకు గుర్తుతెలియని నంబర్ల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వెళ్లాయి. అయినాసరే లెక్కచేయకుండా హాజరైన అతిథుల్ని పోలీసులు, భద్రతాధికారులు తనిఖీల పేరుతో తీవ్రంగా వేధించారు. పలువురు తమ ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. పాక్‌లోని భారత రాయబారి అజయ్‌ బిసారియా ఇస్లామాబాద్‌లోని సెరేనా హోటల్‌లో శనివారం ఇఫ్తార్‌ విందు ఏర్పాటుచేశారు. ఇందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, అధ్యక్షుడు ఆరీఫ్‌ అల్వీ సహా పలువురిని ఆహ్వానించారు. కానీ ఈ విందుకు వీరిద్దరూ గైర్హాజరయ్యారు. ఆ హోటల్‌ వద్ద భారీగా బలగాలను మోహరించిన ప్రభుత్వం, అతిథుల్ని వేధింపులకు గురిచేసింది.

ఫోన్‌చేసి బెదిరింపులు..
ఈ విషయమై ప్రముఖ పాక్‌ జర్నలిస్ట్‌ మెహ్రీన్‌ జెహ్రా మాలిక్‌ మాట్లాడుతూ..‘మొదటగా నా ఆహ్వానపత్రికను పోలీసులు తనిఖీ చేశారు. నా వృత్తి, నివాసం ఉండే చోటు అడిగారు. చివరికి లోపలకు అనుమతించారు. కానీ నా డ్రైవర్‌తో దురుసుగా ప్రవర్తించారు. సెరేనా హోటల్‌ వద్ద భారీగా బలగాలను మోహరించారు. వారంతా హోటల్‌కు వచ్చేవారిని వేధిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరాచీ ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, ఫైసలాబాద్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, లాహోర్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులకు పాక్‌ భద్రతాధికారులు గుర్తుతెలియని నంబర్ల నుంచి శుక్రవారం రాత్రి ఫోన్‌ చేశారు. భారత హైకమిషన్‌ ఇస్తున్న విందుకు వెళ్లరాదని హెచ్చరించారు. ఈ ఘటనను పాక్‌ మీడియా  కవర్‌ చేయలేదు.

పాక్‌ నేతకు చుక్కలు..
ఈ విందుకు హాజరైన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) నేత ఫర్హతుల్లాహ్‌ బాబర్‌కు పాక్‌ అధికారులు చుక్కలు చూపించారు. ‘‘నేను సెరేనా హోటల్‌కు రాగానే బారికేడ్లు దర్శనమిచ్చాయి. వాటిని దాటుకుని ముందుకెళ్లగా భద్రతాధికారులు ఇఫ్తార్‌  రద్దయిందని చెప్పారు. గట్టిగా అడిగేసరికి మరో గేటు నుంచి లోపలకు వెళ్లాలన్నారు. అటుగా వెళితే.. ఇటువైపు రావొద్దు. ముందువైపు గేటు నుంచే హోటల్‌లోకి వెళ్లండని ఇబ్బంది పెట్టారు’ అని బాబర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్షమాపణలు చెప్పిన బిసారియా..
ఇఫ్తార్‌ విందు సందర్భంగా వేధింపులకు గురైన ప్రముఖులకు భారత రాయబారి అజయ్‌ బిసారియా క్షమాపణలు చెప్పారు. ఇఫ్తార్‌ విందుకు కరాచీ, లాహోర్‌ వంటి దూరప్రాంతాల నుంచి హాజరైన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు చాలామంది అతిథులపై పాక్‌ అధికారులు చేయి చేసుకున్నారనీ, మొబైల్‌ఫోన్లు లాక్కున్నారని భారత హైకమిషన్‌ తెలిపింది. ఇది దౌత్య చట్టాలను ఉల్లంఘించడమేననీ, ఈ వ్యవహారంపై పాక్‌ ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. కాగా, ఢిల్లీలో పాక్‌ హైకమిషన్‌ ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు అతిథులు రాకుండా భారత్‌ ఇలాగే అడ్డుకుందనీ, అందుకే ఇలా ప్రతీకారానికి దిగిందని పాక్‌ దౌత్యవర్గాలు చెప్పాయి.

మరిన్ని వార్తలు