‘వారి నిర్లక్ష్యం వల్లే విమానం కుప్పకూలింది’

24 Jun, 2020 16:06 IST|Sakshi

పాకిస్తాన్‌ మంత్రి గులాం సర్వార్‌ ఖాన్‌

ఇస్లామాబాద్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) గురించి చర్చల్లో మునిగి పైలట్‌, కో- పైలట్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే 97 మంది ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్‌ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్‌ ఖాన్‌ తెలిపారు. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన ఎ320 విమానం కుప్పకూలిన ఘటనలో ఎటువంటి సాంకేతిక లోపం చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. పైలట్లు, అధికారుల తప్పిదం వల్లే ఘోర ప్రమాదం సంభవించిందని వెల్లడించారు. ఈ మేరకు బుధవారం పార్లమెంటుకు ఆయన నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘నిజానికి విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదు. 100 శాతం ఫిట్‌గా ఉంది. కెప్టెన్‌, పైలట్‌ కూడా అనుభవం కలవారు. (‘పిల్లలు, పెద్దల ఆర్తనాదాలు.. చుట్టూ మంటలు’)

అదే విధంగా విమానం నడిపేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నారు. కానీ వారి మెదడులో కరోనా గురించిన భయాలు నిండిపోయాయి. దాని గురించి చర్చిస్తూ విమాన గమనంపై దృష్టి సారించలేకపోయారు. అందుకే వారితో పాటు ఇతర కుటుంబాలు నష్టపోయాయి’’అని పేర్కొన్నారు. అదే విధంగా.. పైలట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారుల సూచనలు పట్టించుకోలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ల్యాండింగ్‌ విషయంలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ‘నేను చూసుకుంటానులే’ అని వ్యాఖ్యానించిన పైలట్‌.. అనంతరం మళ్లీ కరోనా గురించి మాట్లాడటం మొదలుపెట్టాడని కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లో రికార్డైందని వెల్లడించారు. కాగా మే 22న పాకిస్తాన్‌లో కరాచిలో జనావాసాల్లో విమానం కుప్పకూలిన ఘటనలో 97 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే.(‘పైలెట్‌ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’)

మరిన్ని వార్తలు