హఫీజ్‌ సయీద్‌కు పాకిస్తాన్‌ షాక్‌..!!

1 Jan, 2018 17:47 IST|Sakshi
లష్కరే తైబా సహవ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌

కరాచీ : ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు హఫీజ్‌ సయీద్‌ ఆస్తులను, సంస్థలను హస్తగతం చేసుకునేందుకు పాకిస్తాన​ప్రభుత్వం వ్యూహాన్ని రచించిందా?. ఈ విషయాన్నే రాయిటర్స్‌ రిపోర్టులు ధ్రువపరుస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ 19న ఈ మేరకు ఫెడరల్‌ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లతో పాకిస్తాన్‌ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

హఫీజ్‌ సయీద్‌కు చెందిన జమాత్‌-ఉద్‌-దవా(జేయూడీ), ఫలా-ఈ-ఇన్‌సానియాత్‌ ఫౌండేషన్‌(ఎఫ్‌ఐఎఫ్‌)లను హస్త గతం చేసుకోవాలని పాకిస్తాన్‌ ఆర్థిక శాఖకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌, దేశంలోని ఐదు ప్రావిన్సుల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

2008 నవంబర్‌లో ముంబైపై ఉగ్రదాడులు చేసిన లష్కర్‌-ఈ-తైబాకు జేయూడీ, ఎఫ్‌ఐఎఫ్‌లు సాయం చేశాయని అమెరికా పేర్కొంది. వాటిని ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించే సంస్థలుగా పరిగణించేందుకు నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది.

ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడిగా ఉన్న హఫీజ్‌ సయీద్‌ను పట్టుకోవడానికి సమాచారం అందించిన వారికి 10 మిలియన్‌ డాలర్ల బహుమానాన్ని కూడా ప్రకటించింది. కాగా, హఫీజ్‌ సయీద్‌ సంస్థలను స్వాధీనం చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై పాకిస్తాన్‌ హోం శాఖ మంత్రి అహ్‌శాన్‌ ఇక్బాల్‌ను అడుగ్గా.. నిధులు సమకూర్చుకుంటున్న అన్ని సంస్థలపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు