పాక్‌ పిటిషన్‌; బీజేపీ సీఎం, ఎమ్మెల్యే పేర్లు కూడా!

29 Aug, 2019 12:35 IST|Sakshi

న్యూయార్క్‌: కశ్మీర్‌ అంశంపై భారత్‌ను ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో దాయాది దేశం పాకిస్తాన్‌ అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రపంచంలోని కీలక దేశాలన్నీ ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూ కశ్మీర్‌ పునర్విభజన అంశంపై స్పందించాల్సిందిగా అభ్యర్థించిన పాక్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు అడుగడుగునా భంగపాటే ఎదురైంది. ఈ క్రమంలో కశ్మీర్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను పరిశీలించాల్సిందిగా పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జమ్మూ కశ్మీర్‌లో మానవ ఉల్లంఘన జరుగుతుందన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను లేఖలో ప్రస్తావించింది.

ఈ క్రమంలో రాహుల్‌ పిల్ల చేష్టలు, అనవరపు రాద్దాంతాలను పాక్‌ భారత్‌కు వ్యతిరేకంగా మార్చుకుందని బీజేపీ నేతలు విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను చాలా విషయాల్లో ప్రభుత్వ చర్యలతో విభేదించినప్పటికీ కశ్మీర్‌ భారత అంతర్గత వ్యవహారం అనడంలో స్పష్టతతో ఉన్నానని రాహుల్‌ వివరణ ఇచ్చారు. కశ్మీర్‌లో పాకిస్తాన్‌ హింసను ప్రేరేపిస్తోందని, అక్కడ జరిగే ఉగ్రదాడుల వెనుక పాక్‌ హస్తం ఉందని ఆరోపించారు. పాక్‌ తన అసత్య ప్రచారానికి రాహుల్‌ పేరును వాడుకుంటోందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా కశ్మీరీ అమ్మాయిలను ఉద్దేశించి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్‌ సైనీ చేసిన వ్యాఖ్యలను కూడా పాక్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు తాజాగా వెల్లడైంది. కశ్మీర్ అంశంపై యూఎన్‌లో వేసిన పిటిషన్‌లో.. ‘యుద్ధానికి ఆయుధంగా లింగ వివక్షపూరిత హింస’  అనడానికి నిదర్శనంగా వీరి మాటలు ఉన్నాయంటూ సదరు నేతలు మాట్లాడిన వీడియోలు జతచేసింది. ‘ఇక్కడ అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి మా ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బిహార్‌ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని చెప్పేవారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. అందరి చూపు ఇక కశ్మీరీ అమ్మాయిల పైపే ఉంటుంది. ఆర్టికల్‌ 370 రద్దవడంతోనే ఇది సాధ్యమైంది. కశ్మీరీ అమ్మాయిల్ని కోడళ్లుగా, భార్యగా చేసుకునేందుకు అందరూ మొగ్గుచూపుతారు’ అన్న హర్యానా సీఎం వాఖ్యలను లేఖలో ఉటంకించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌పై విరుచుకుపడిన బీజేపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారంటూ పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాజకీయాలు మాని పాక్‌ ఆరోపణలకు చెక్‌ పెట్టే విధంగా కశ్మీర్‌లో పరిస్థితులు చక్కదిద్దాలని పరిశీలకులు హితవు పలుకుతున్నారు.

>
మరిన్ని వార్తలు