అందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ సిద్ధం: పాకిస్తాన్‌

14 Mar, 2020 13:06 IST|Sakshi
భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: మహమ్మారి కోవిడ్‌-19(కరోనా వైరస్‌)ను ఎదుర్కొనేందుకు కలసికట్టుగా పోరాడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ సార్క్‌ దేశాల ముందు ఉంచిన ప్రతిపాదనకు పాకిస్తాన్‌ సానుకూలంగా స్పందించింది. కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్చల్లో తాము కూడా భాగస్వామ్యమవుతామని పేర్కొంది. ఈ మేరకు... ‘‘ కోవిడ్‌-19 నుంచి ప్రమాదం పొంచి ఉన్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా.. ప్రాంతాల వారీగా సంయుక్త చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. దీని గురించి చర్చించేందుకు జరిగే  సార్క్‌ సభ్య దేశాల వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాన మంత్రి ప్రత్యేక సహాయకుడు పాల్గొంటారని మేం సమాచారమిచ్చాం’’ అని పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ట్విటర్‌లో పేర్కొన్నారు. అదే విధంగా కరోనా విషయంలో పొరుగు దేశాలకు సహకరించేందుకు తమ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. (కోవిడ్‌‌: చైనా రాయబారికి అమెరికా నోటీసులు)

కాగా ప్రాణాంతక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ... ‘‘ కరోనాతో పోరాడేందుకు సార్క్‌ దేశాల నాయకత్వంలో వ్యూహాలు రచించాల్సిందిగా నేను ప్రతిపాదిస్తున్నాను. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మనం చర్చిద్దాం. మన పౌరులను ఆరోగ్యవంతులుగా ఉంచుదాం. ఆరోగ్యకరమైన గ్రహం కోసం సంయుక్తంగా పనిచేసి ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుద్దాం’’అని ట్విటర్‌లో పిలునిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు భూటాన్‌, మాల్దీవులు, శ్రీలంక సానుకూలంగా స్పందించాయి. దీనినే నాయకత్వ ప్రతిభ అంటారని భూటాన్‌ ప్రధాని పేర్కొనగా.. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి గొప్ప ముందడుగు వేశారంటూ శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స మోదీని ప్రశంసించారు. ఇక తాజాగా దాయాది దేశం కూడా భారత ప్రధాని ఆలోచనను అమలు చేసేందుకు సిద్ధమైంది. కాగా సౌత్‌ ఏషియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ రీజనల్‌ కోఆపరేషన్‌ కూటమిలో భారత్‌, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులు, నేపాల్‌, శ్రీలంక సభ్యదేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే.(కరోనా ఎఫెక్ట్‌: అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీ)

మరిన్ని వార్తలు