గ్రే లిస్టులోనే పాకిస్తాన్‌

22 Feb, 2020 03:59 IST|Sakshi

న్యూఢిల్లీ: లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహాన్ని అడ్డుకోని పాకిస్థాన్‌ను పలు ఆంక్షలు విధించేందుకు వీలు కల్పించే గ్రే లిస్ట్‌లోనే కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లోపు ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆదేశాలను అమలు చేయకపోతే వాణిజ్యపరమైన పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పాక్‌ను హెచ్చరించింది. భారత్‌లో పలు ఉగ్రదాడులకు కారణమైన సంస్థలకు నిధులు అందకుండా చేసేందుకు 27 చర్యలు చేపట్టాలని ఆదేశించినా పాకిస్థాన్‌ వాటిల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేసిందని గుర్తు చేసింది. పాకిస్థాన్‌ గ్రే లిస్టులో కొనసాగితే ఈయూ, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందడం కష్టమవుతుంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయం ఇప్పటికే అధ్వాన్న స్థితిలో ఉన్న పాక్‌ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ దన్నుగా నిలుస్తోందని, దానిపై చర్యలు చేపట్టాలని భారత్‌ ఎఫ్‌ఏటీఎఫ్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు సంబంధించిన రుజువులూ అందిస్తూ వచ్చింది. 

మరిన్ని వార్తలు