భారత్‌లో నరమేధానికి దొడ్డిదారి

18 May, 2016 15:54 IST|Sakshi
భారత్‌లో నరమేధానికి దొడ్డిదారి

న్యూఢిల్లీ: తక్కువ వ్యయంతో భారత్‌లో రక్తపాతం సృష్టించడానికి అత్యంత సులువైన మార్గం జీహాద్ (పవిత్రయుద్ధం) ఒక్కటేననేదే పాకిస్తాన్ యోచన. సైనిక బలం విషయంలో భారత్‌తో సమానంగా ఎదగడానికి ఈ విధానమే సరైనదని భావిస్తోంది. పైగా అక్కడి వ్యవస్థ, చట్టాల ప్రకారం జీహాదీలను విచారించడం కష్టం. ఇందుకు కారణం వారిని అక్కడ మంచివారిగా భావించడమే. ఈ విషయాన్ని అమెరికాలో పాక్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కాని వెల్లడించారు. ‘ఇండియా వర్సెస్ పాక్: వైకాంట్ ఉయ్ బీ ఫ్రెండ్స్’ పేరిట ఇటీవల రాసిన తన పుస్తకంపై ఆయన తన మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. జీహాద్, భారత్‌తో సంబంధాలు, ఐఎస్‌ఐతో పాక్ సైన్యానికి గల సంబంధాలు తదితర అంశాలను ఈ సందర్భంగా వెల్లడించారు.

ముంబైపై ఉగ్రవాదుల దాడి గురించి ప్రశ్నించగా పాల్గొన్నది తమ వారైనా ఆపరేషన్‌తో సంబంధం లేదన్నారు. ‘పాకిస్థాన్‌కు చెందినవారి ప్రమేయం ఉంది’ అని అన్నారు. అయితే వారు ఎవరనేది ఆయన వెల్లడించలేదు. దాడికి రూపకల్పనచేసినవారిలో పాకిస్తాన్ సైనిక విభాగం విశ్రాంత అధికారులు, విశ్రాంత గూఢచార విభాగం అధికారులు కూడా ఉన్నారని తెలిపారు.

కాగా అన్ని ఆధారాలు సమర్పించినప్పటికీ ముంబైపై ఉగ్రదాడి కేసు లోతుల్లోకి పాకిస్తాన్ వెళ్లనేలేదు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరదించాలంటూ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి కండోలెజ్జా రైస్ గతంలో కోరినా పాక్.. ఎంతమాత్రం స్పందించలేదు. 1990 నుంచి పాకిస్తాన్ ఇదే ధోరణిని అనుసరిస్తోంది. ఉగ్రవాదుల దాడి విషయంలో అమెరికా..పాక్‌పై ఒత్తిడి తీసుకురాగా  అందుకు నిరాకరించింది. ఆ తర్వాత కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చింది.

మరిన్ని వార్తలు