ప్రియాంకపై వేటు వేయండి : ఐరాసకు పాక్‌ లేఖ

21 Aug, 2019 16:28 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : బాలీవుడ్‌ నుంచి గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రాపై పాకిస్తాన్‌ దుర్నీతి ప్రదర్శించింది. ప్రియాంక చోప్రాను యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా తొలగించాలని పాక్‌ మానవ వనరుల మంత్రి షిరీన్‌ మజరి ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. కశ్మీర్‌పై భారత వైఖరిని ప్రియాంక చోప్రా బాహాటంగా సమర్ధించడంతో పాటు భారత రక్షణ మంత్రి పాకిస్తాన్‌కు చేసిన అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలను వెనకేసుకొచ్చారని, ఇది శాంతి, సామరస్య భావనలకు విరుద్ధమని మజరి ఐరాసకు రాసిన లేఖలో ఆరోపించారు. ఐరాస గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ప్రియాంక చోప్రా శాంతి వెల్లివిరిసేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

బాలాకోట్‌ వైమానిక దాడుల అనంతరం ఈ దాడులను సమర్ధిస్తూ ప్రియాంక ట్వీట్‌ చేయడాన్ని పాక్‌ తప్పుపడుతోంది. బాలాకోట్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దాడులను ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్‌ అంబాసిడర్‌ హోదాలో ప్రియాంక చోప్రా సమర్ధించడం పట్ల లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ప్రియాంకను పాక్‌కు చెందిన ఆయేషా అనే మహిళ నిలదీశారు. ప్రియాంక తీరును కపటత్వంగా ఆయేషా అభివర్ణిస్తూ మండిపడ్డారు. ఆమె ఆరోపణలపై గ్లోబల్‌ స్టార్‌ ఆ వేదికపై దీటుగా స్పందించారు. ‘మీరు ఆవేదన వెళ్లగక్కడం పూర్తయిందా.. అసలు యుద్ధం నేను నిజంగా ఇష్టపడే విషయం కాదు, కానీ మొదట నేను దేశభక్తురాలిని.. నన్ను ప్రేమిస్తున్న మరియు నన్ను ప్రేమించిన వ్యక్తుల పట్ల మనోభావాలను దెబ్బతీస్తే క్షమించండి. కానీ మనందరికీ మనమందరం అనుసరించాల్సిన మార్గం ఒకటుంది..మీరు కేకలు వేయడం మాని మనమంతా ప్రేమ కోసమే ఇక్కడ ఉన్నా’మని ప్రియాంక వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు