మెరుపు దాడులపై స్పందించిన అమెరికా

27 Feb, 2019 09:10 IST|Sakshi

పాకిస్థాన్‌కు ఘాటు సూచన!

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం మరోసారి మెరుపుదాడులు చేసిన నేపథ్యంలో అమెరికా స్పందించింది. భారత మెరుపుదాడుల నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు మరింత పెరగకుండా పాకిస్థాన్‌ సంయమనంతో వ్యవహరించాలని, తన భూభాగంలోని ఉగ్రవాద తండాలపై వెనువెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా ఘాటుగా సూచించింది. భారత్‌ వైమానిక దళం జరిపిన దాడులు.. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగానే చూడాలని స్పష్టం చేసింది. ‘మెరుపుదాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీతో మాట్లాడాను.

‘ప్రస్తుత ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసేలా సైనిక చర్యకు దిగరాదని, పాకిస్థాన్‌ భూభాగంలోని ఉగ్రవాద గ్రూపులపై సత్వరమే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయనకు నొక్కి చెప్పాను’ అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కూడా మాట్లాడానని, తమ రక్షణపరమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ.. ఉపఖండంలో శాంతిభద్రతలను కాపాడాలన్న ఉమ్మడి లక్ష్యం గురించి తాము చర్చించామని ఆయన తెలిపారు. ఇరుదేశాలు సంయమనంతో వ్యవహరించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ మరింతగా ఉద్రిక్తతలు పెంచేవిధంగా వ్యవహరించవద్దని, సైనిక చర్యలకు పాల్పడకుండా చర్చలకు ముందుకురావాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు