దొంగబుద్ధి మార్చుకోని పాకిస్తాన్‌

24 Sep, 2017 19:12 IST|Sakshi

గాజా అల్లర్ల ఫొటో కశ్మీర్‌దంటూ ఐరాసలో బుకాయింపు

అంతర్జాయ సమాజం ముందు బయటపడ్డ పాక్ వైఖరి

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ బుద్ధి, కుక్క తోక ఎప్పటికీ వంకరే. ఎంత మార్చాలన్నా.. అప్పటికే కానీ.. తరువాత మాత్రం తోకను వంకరే చేస్తాయి. తప్పుడు బుద్ధితో, దిక్కుమాలిన దుర్నీతితో భారత్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని.. అడ్డంగా దొరికిపోయింది. ఎక్కడో గాజాలో జరిగిన బాంబుదాడి ఫొటోను కశ్మీర్‌ను ఆపాదించాలని.. ప్రయత్నించి ప్రపంచ దేశాల ముందు, ఐక్యరాజ్య సమితిలో తానే దొంగలా దొరికిపోయింది. అసలు విషయం ఏమిటంటే.. ఐక్యరాజ్య సమితి సర‍్వప్రతినిధి సమావేశాల్లో పాకిస్తాన్‌ను టెర్రరిస్తాన్‌గా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పేర్కొన్నారు. అంతేకాక కశ్మీర్‌లో చొరబాట్లు, సరిహద్దుల్లో కాల్పుల ఒప్పంద విరమణ ఉల్లంఘన, పాకిస్తాన్‌లో పేరొందిన ఉగ్రవాదులు ఉండడాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.

సుష్మా స్వరాజ్‌ ప్రసంగం తరువాత.. సమితిలో పాక్‌ రాయబారిగా ఉన్న మలీహా లోధి మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని భారతే పెంచి పోషిస్తోందని అబద్దపు ప్రకటనలు చేశారు. అంతటితో ఊరుకోకుండా.. ఒక ఫొటోను అందరికీ చూపుతూ.. కశ్మీర్‌లో మానవహక్కులను భారత్‌ హరించి వేస్తోందంటూ.. అందుకు నిదర్శనం ఈ ఫొటోనే అని ప్రకటించారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు అని చూడకుండా పెల్లెట్లను ప్రయోగిస్తోందని ఆమె మోసపూరిత ప్రకటనలు చేశారు. లోధి ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రసంగానికి ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు సైతం నిజమేనని నమ్మారు. కానీ ఆమె చూపిన ఫొటోతో కశ్మీర్‌కు, భారత్‌కు ఎటువంటి సంబంధంలేని విదేశాంగ శాఖ నిరూపించి.. పాక్‌ను దొంగగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టింది.

పాకిస్తాన్‌ రాయబారి మలీహా లోధి సమితిలో చూపిన ఫొటో.. 2014లో గాజా అ‍ల్లర్లలో గాయపడ్డ రవా అబూ జామ్‌ అనే మహిళది. చిత్రంలోని మహిళ కూడా పెల్లెట్ల వల్ల ముఖం అంతా రక్తమోడుతోంది. ఆ ఫొటోను.. పాకిస్తాన్‌ కశ్మీర్‌కు ఆపాదించి.. ప్రయోజనం పొందాలని భావించి అంతర్జాతీయ సమాజం ముందు భంగపడింది. ఈ చిత్రంపై నిజానిజాలు పాకిస్తాన్‌ ఉన్నతాధికారులకు తెలిపినా.. వాళ్లు పెద్దగా స్పందించలేదు.

మరిన్ని వార్తలు