‘తనను చంపినందుకు బాధ లేదు’

27 Sep, 2019 14:52 IST|Sakshi

ముల్తాన్‌/పాకిస్తాన్‌ : పాకిస్తాన్‌లో సంచలనం సృష్టించిన సోషల్‌ మీడియా స్టార్‌ కందీల్‌ బలోచ్‌ హత్య కేసులో ఆమె సోదరుడికి స్థానిక కోర్టు జీవితఖైదు విధించింది. పరువు హత్యకు పాల్పడిన అతడు జీవితాంతం జైలులో ఉండాలని శుక్రవారం తీర్పు వెలువరించింది. వివరాలు... పాకిస్తాన్‌కు చెందిన బలోచ్‌ సెల్ఫీ స్టార్‌గా ఫేమస్‌ అయ్యింది. దీంతో ఆమెకు సోషల్‌ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో పూర్తి వ్యక్తిగతమైన ఫొటోలను కూడా ఆమె సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం ప్రారంభించింది. తద్వారా ‘పాకిస్తాన్‌ కిమ్‌ కర్ధాషియన్‌’గా గుర్తింపు పొందింది.

ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన బలోచ్‌ సోదరుడు మహ్మద్‌ వసీం 2016 జూలైలో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడు విలేకరులతో మాట్లాడుతూ... తన సోదరిని చంపినందుకు ఏమాత్రం బాధ పడటం లేదని, తన అసభ్య ప్రవర్తన కారణంగానే ఆమెను అంతమొందించానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం... పరువు హత్యగా నమోదైన ఈ కేసులో ముల్తాన్‌ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. వసీంకు జీవితఖైదు విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే తన క్లైంట్‌ను స్థానిక కోర్టు దోషిగా తేల్చినప్పటికీ.. హైకోర్టులో అతడికి న్యాయం జరుగుతుందని వసీం తరఫు న్యాయవాది పేర్కొన్నాడు. ఇక వసీం తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు అమాయకుడని, చనిపోయిన కూతురు కంటే ప్రస్తుతం జీవించి ఉన్న వసీం జీవితం తనకు ముఖ్యమని పేర్కొన్నారు. 

కాగా పాకిస్తాన్‌లో కిసాస్‌ అండ్‌ దియాత్‌ చట్ట ప్రకారం సమీప బంధువు హత్య కేసులో నిందితుడైన ఓ వ్యక్తి బాధితుల బంధువుల నుంచి క్షమాభిక్ష పొంది నేరం నుంచి తప్పించుకునే వీలు ఉండేది. దీంతో అక్కడ పరువు హత్యలు యథేచ్ఛగా సాగేవి. ఈ క్రమంలో బలోచ్‌ హత్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో పరువు హత్యకు పాల్పడిన వారికి జీవితఖైదు విధించేలా పాక్‌ పార్లమెంట్‌ చట్టం రూపొందించింది. అయితే ఒక హత్య పరువుకు సంబంధించిం‍దా కాదా అనే విషయాన్ని నిర్ధారించడం జడ్జి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. ఇక బలోచ్‌ కేసు విషయంలో తొలుత తమ కుమారుడిని శిక్షించాలని కోరిన ఆమె తల్లిదండ్రులు.. తర్వాత మనసు మార్చుకుని అతడిని క్షమిస్తున్నామని కోర్టుకు తెలిపారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా