అణు క్షిపణిని పరీక్షించిన పాక్‌

30 Aug, 2019 04:04 IST|Sakshi

బాలిస్టిక్‌ క్షిపణి ‘ఘజ్నవి’ ప్రయోగం

పరిధిలోకి భారతదేశ భూభాగాలు

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత భారతదేశంపై కయ్యానికి కాలు దువ్వుతున్న దాయాది దేశం పాకిస్తాన్‌ తాజాగా అణు బాలిస్టిక్‌ క్షిపణి ‘ఘజ్నవి’ని విజయవంతంగా పరీక్షించింది. ఇప్పటికే కరాచీలోని మూడు గగనతల మార్గాలను మూసివేసి, నిత్యం భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతున్న పాక్‌ ఇప్పుడు ఏకంగా అణు క్షిపణిని పరీక్షించడం గమనార్హం. అణు వార్‌హెడ్లను (అత్యధిక తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలు) మోసుకెళ్లే సామర్థ్యమున్న ఈ క్షిపణి  290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని ఆర్మీ తెలిపింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే దీనిద్వారా భారత దేశంలోని కొంత భూభాగాన్ని సైతం లక్ష్యంగా చేసుకోవచ్చు.

స్కడ్‌ టైప్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ను అభివృద్ధి చేసి ఘజ్నవిని రూపొందించినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఘజ్నవి వీడియోను పాకిస్తాన్‌ మిలిటరీ మీడియా అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ గురువారం ట్విట్టర్‌ ద్వారా బయటపెట్టారు. బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తల బృందాన్ని పాకిస్తాన్‌ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వీ, ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందించారని అసిఫ్‌ గఫూర్‌ తెలిపారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ‘నాజర్‌’, మే నెలలో ‘షహీన్‌–2’ అనే బాలిస్టిక్‌ మిస్సైళ్లను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌ విషయంలో ఆర్టికల్‌ 370ని భారత ప్రభుత్వం నిర్వీర్యం చేయడంపై పాకిస్తాన్‌ భగ్గుమంటోంది. కశ్మీర్‌పై ఎంతదాకా అయినా వెళ్తామని, అణు యుద్ధానికైనా సిద్ధమని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ గతంలోనే చెప్పారు.

ఈ అణు క్షిపణి
లక్ష్య పరిధి: 290 కి.మీ.
బరువు: 5,256 కేజీలు
పొడవు: 9.64 మీటర్లు
చుట్టుకొలత: 88 సె.మీ
వార్‌హెడ్‌: అణ్వాయుధం

మరిన్ని వార్తలు