భారత రాయబారికి పాక్‌ సమన్లు

20 Oct, 2019 20:23 IST|Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ భారత డిప్యూటీ హై కమిషనర్‌ గౌరవ్‌ అహ్లువాలియాకు సమన్లు జారీచేసింది. పాక్‌ అక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 4 ఉగ్రస్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు పాక్‌ సైనికులతో పాటు, పలువురు ఉగ్రవాదులు మరణించారని భారత ఆర్మీ పేర్కొంది. అయితే భారత్‌  కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి.. తమ దేశ పౌరులను పొట్టనబెట్టుకుందని ఆరోపించింది. దీంతో పాక్‌ మరోసారి భారత్‌పై తన ద్వేషాన్ని ప్రదర్శించినట్టయింది. 

భారత కాల్పుల్లో ఓ పాక్‌ సైనికుడితో పాటు ముగ్గురు పౌరులు చనిపోయారని పాక్‌ ఆర్మీ అధికారులు చెప్పారు. అలాగే ఇద్దరు సైనికులు, ఐదుగురు పౌరులు చనిపోయినట్టు తెలిపారు. ఎక్కడ కూడా ఉగ్ర స్థావరాలు గానీ, ఉగ్రవాదులు గానీ మరణించినట్టు పాక్‌ పేర్కొనక పోవడం గమనార్హం. కాగా, తాంగ్ధర్‌ సెక్టార్‌లో శనివారం సాయంత్రం పాక్‌ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిందని భారత ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లోకి తీవ్రవాదులను పంపేందుకు పాక్‌ ఆర్మీ ఈ కాల్పులు జరిపిందని తెలిపాయి. అందువల్లే తాము పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేయాల్సి వచ్చిందని వెల్లడించాయి.

>
మరిన్ని వార్తలు