పాక్‌ తాలిబన్‌ చీఫ్‌ ఫజ్‌లుల్లా హతం

16 Jun, 2018 03:33 IST|Sakshi

మలాలాపై దాడి, పెషావర్‌ హైస్కూల్‌ ఘటనల్లో సూత్రధారి

అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైమానిక దళం డ్రోన్‌ దాడులు

వాషింగ్టన్‌/ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజ్‌లుల్లాను అమెరికా వైమానిక దళం హతమార్చింది. అఫ్గానిస్తాన్‌లోని కునార్‌ ప్రావిన్స్‌లో జరిపిన డ్రోన్‌ దాడుల్లో అతడు చనిపోయినట్లు ఆ దేశ రక్షణ శాఖ అధికారి ఒకరు శుక్రవారం ధ్రువీకరించారు. 2012లో పాకిస్తాన్‌ బాలిక మలాలాపై దాడి జరిగిన సమయంలో ఫజ్‌లుల్లా స్వాత్‌ లోయలో తాలిబన్‌ కార్యకలాపాలకు ఇన్‌చార్జిగా వ్యవహరించాడు. 2013లో ఆ సంస్థకు చీఫ్‌ అయిన తరువాత అమెరికా, పాకిస్తాన్‌లకు వ్యతిరేకంగా ఎన్నో దాడులకు కుట్ర పన్నాడు.

అందులో 2014 నాటి.. 130 మంది చిన్నారులు సహా మొత్తం 151 మందిని బలిగొన్న పెషావర్‌ హైస్కూల్‌ దాడి ఘటన కూడా ఉంది. 2010లో న్యూయార్క్‌లోని టైమ్స్‌స్క్వేర్‌ వద్ద కారుబాంబుతో దాడి చేయడానికి ఆ సంస్థ ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది. అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఫజ్‌లుల్లా తలపై 5 మిలియన్‌ డాలర్ల(రూ. 34 కోట్లు) రివార్డు ఉంది. 2009లో పాకిస్తాన్‌లోని కైబర్‌–పఖ్తూన్‌క్వా ప్రావిన్స్‌లో తన అనుచరులందరూ హతమయ్యాక.. అఫ్గానిస్తాన్‌కు పారిపోయాడు. అక్కడి నుంచే పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాడు.  

రేడియోలో రెచ్చగొట్టే ప్రసంగాలు..
ఒక సీనియర్‌ ఉగ్ర నాయకుడు లక్ష్యంగా దాడులు చేశామని గురువారం అమెరికా రక్షణ శాఖ ప్రకటించినా.. మరణించిన ఉగ్రవాది పేరును మాత్రం వెల్లడించలేదు. ‘జూన్‌ 13న కునార్‌ ప్రావిన్స్‌లో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఒక ఉగ్రనేత లక్ష్యంగా అమెరికా వైమానిక బలగాలు దాడులు చేశాయి’ అని లెఫ్టినెంట్‌ కల్నల్‌ మార్టిన్‌ చెప్పారు. అయితే ఫజ్‌లుల్లా మృతిని శుక్రవారం అఫ్గాన్‌ రక్షణ శాఖ ప్రతినిధి మొహమ్మద్‌ రద్మానిష్‌ ధ్రువీకరించారు.

కునార్‌ ప్రావిన్స్‌లోని నురుగుల్‌ కాలే గ్రామ సమీపంలో అమెరికా బలగాల డ్రోన్‌ దాడిలో ఫజ్‌లుల్లాతో పాటు మరో నలుగురు తాలిబన్‌ కమాండర్లు మరణించారని ‘ద ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌’ పత్రిక తెలిపింది. ఫజ్‌లుల్లా, అతని అనుచరులు ఇఫ్తార్‌ విందు చేసుకునే సమయంలో డ్రోన్‌ విమానం బాంబుల వర్షం కురిపించిందని మరికొన్ని నివేదికలు వెల్లడించాయి. ఫజ్‌లుల్లా మృతిని తాలిబన్‌ ఇంకా ధ్రువీకరించలేదు. 2010, 2014లలోనూ ఫజ్‌లుల్లా మృతిచెందినట్లు వార్తలు వెలువడినా, ఆ తరువాత అవి అబద్ధాలని తేలింది.

ప్రైవేట్‌ రేడియోల్లో విస్తృతంగా ప్రసంగించి రెచ్చగొట్టే ఫజ్‌లుల్లాకు రేడియో ముల్లా, మౌలానా రేడియో అనే పేర్లు కూడా ఉన్నాయి. అయితే అతను అఫ్గానిస్తాన్‌ పారిపోయాక ఆ రేడియో స్టేషన్లను మూసివేశారు. రంజాన్‌ మాసంలో అఫ్గాన్‌ ప్రభుత్వం, తాలిబన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న సమయంలో తాజా దాడి జరగడం గమనార్హం. ఆ ఒప్పందాన్ని గౌరవిస్తామని, కానీ, అమెరికా ఉగ్ర వ్యతిరేక పోరుకు దానితో సంబంధంలేదని నాటో అధికారి తెలిపారు. 

మరిన్ని వార్తలు