ఈ నెల 29నుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఓపెన్‌

27 Jun, 2020 13:26 IST|Sakshi

ప్రకటన విడుదల చేసిన పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ 

ఇస్లామాబాద్‌: సిక్కు యాత్రికుల కోసం జూన్‌ 29 నుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ శనివారం భారత్‌కు తెలిపింది. మహారాజా రంజీత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కారిడార్‌ను తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా స్థలాలు తెరిచారు. మహారాజా రంజీత్ సింగ్ వర్ధంతి సందర్భంగా జూన్ 29న కారిడార్‌ను తిరిగి తెరవడానికి మేము సిద్ధంగా ఉ‍న్నట్లు భారత్‌కు తెలియజేస్తున్నాం’ అంటూ ఖురేషి ట్వీట్ చేశారు. కరోనా వైరస్‌ కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ సంవత్సరం మార్చిలో కారిడార్ మూసివేసిన సంగతి తెలిసిందే.

అయితే దీనిపై పంజాబ్‌ ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పౌరులకు కూడా కర్తార్‌పూర్ సాహిబ్‌లోకి ప్రవేశం ఉన్నందున.. వారి ద్వారా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే భారతీయ యాత్రికులు కూడా కరోనా బారిన పడే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ను గత ఏడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు