పాక్‌ ఉద్యమకారిణి కన్నుమూత

12 Feb, 2018 02:13 IST|Sakshi
పాకిస్తాన్‌ మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్‌

లాహోర్‌లో గుండెపోటుతో అస్మా మృతి

మానవహక్కుల కోసం అలుపెరగని పోరాటం  

లాహోర్‌: పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది, మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్‌(66) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పాకిస్తాన్‌ సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌కు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన అస్మా.. శక్తిమంతమైన ఆర్మీ, నిఘా సంస్థ ఐఎస్‌ఐల వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించేవారు. 1952లో లాహో ర్‌ జన్మించిన అస్మా, పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి 1978లో ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని 1983లో అప్పటి పాక్‌ నియంత జియా ఉల్‌ హక్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడంతో సైనిక ప్రభుత్వం ఆమెను జైల్లో నిర్బంధించింది.

జైలు నుంచి విడుదలైన అనంతరం 1986లో స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు వెళ్లిన ఆమె..డిఫెన్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు రెండేళ్లు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1987లో పాకిస్తాన్‌లో స్థాపించిన జాతీయ మానవహక్కుల సంఘానికి 1993 వరకూ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఆ తర్వాత చైర్మన్‌గానూ వ్యవహరించారు. 2007లో అప్పటి పాక్‌ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఇఫ్తికార్‌ చౌధురిని సైనిక నియంత పర్వేజ్‌ ముషార్రఫ్‌ పదవి నుంచి తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు పెద్దఎత్తున చేపట్టిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. మానవహక్కుల రంగంలో చేసిన కృషికి గానూ 2014లో రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డు, 2010లో ఫ్రీడమ్‌ అవార్డు, హిలాల్‌ ఏ ఇంతియాజ్‌ అవార్డులను ఆమె అందుకున్నారు. అస్మా మృతి పట్ల బాలీవుడ్‌ దర్శకులు మహేశ్‌ భట్, నందితా దాస్, రచయిత జావేద్‌ అక్తర్, నటి షబానా అజ్మీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు