అభినందన్‌ మా అతిథి: పాక్‌ వ్యక్తి

29 Feb, 2020 13:22 IST|Sakshi

ఇస్లామాబాద్‌: తాను చేసిన టీ తాగి.. భారత వైమానిక దళ కమాండర్‌ అభినందన్‌ తనను ప్రశంసించారని పాకిస్తాన్‌కు చెందిన అన్వర్‌ అలీ అన్నాడు. రుచికరమైన టీ ఇచ్చినందుకు తనకు ధన్యవాదాలు కూడా తెలిపారని పేర్కొన్నాడు. వైమానిక దాడుల్లో భాగంగా గతేడాది ఫిబ్రవరి 27న భారత పైలట్‌ అభినందన్‌ పాకిస్తాన్‌ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్‌-21 కూలిపోవడంతో ప్యారాచూట్‌ సాయంతో పాక్‌ భూభాగంలో దిగారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఆయనను.. పాక్‌ ఆర్మీ అధికారులు దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలోకి తీసుకున్నారు. అభినందన్‌ నుంచి భారత సైన్యానికి సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ముఖం నిండా రక్తంతో ఉన్న అభినందన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అంతర్జాతీయంగా.. చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో పాక్‌ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో అభినందన్‌ టీ తాగుతూ.. కాస్త ప్రశాంతమైన వదనంతో కనిపించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.(పాక్‌ మ్యూజియంలో అభినందన్‌ బొమ్మ)

కాగా ఇదంతా జరిగి గురువారం నాటికి ఏడాది పూర్తైన సందర్భంగా పాకిస్తాన్‌ జర్నలిస్టు ఒకరు‌.. అభినందన్‌కు టీ ఇచ్చినట్లుగా ప్రచారంలో ఉన్న అన్వర్‌ అలీతో మాట్లాడాడు. ‘‘శత్రుసైన్యానికి చెందిన పైలట్‌’’కు మర్యాద చేయడాన్ని ఎలా భావిస్తున్నారని సదరు జర్నలిస్టు అతడి అడుగగా... ‘‘ ఆయన మా అతిథి. టీ తాగి బాగుందని చెప్పారు’’అని పేర్కొన్నాడు. అభినందన్‌కు ఆనాడు అందించిన కప్‌, సాసర్‌ను ఈ సందర్భంగా అందరికీ చూపించాడు. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో.. పాక్‌ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్‌ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌ భూభాగంలో దిగిన ఆయన.. అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ భారత్‌కు చేరుకున్నారు. దాయాది దేశ సైన్యానికి చిక్కినప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. ధైర్యసాహసాలు ప్రదర్శించి కర్తవ్యాన్ని నిర్వర్తించిన అభినందన్‌ను.. వీరచక్ర శౌర్య పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. 

మరిన్ని వార్తలు