గిరిజన యువకుడి దారుణ హత్య

7 Mar, 2019 14:50 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో సంచలనం సృష్టించిన గిరిజన బాలికల హత్యలను వెలుగులోకి తెచ్చిన అఫ్జల్‌ కోహిస్తానీ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు అతడిని అత్యంత కిరాకతకంగా కాల్చి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఖైబర్‌ ఫంక్తువాలో ప్రావిన్స్‌లోని అబోటాబాద్‌ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

స్థానిక మీడియా కథనం ప్రకారం... 2012లో ఓ వివాహ వేడుకకు ఐదుగురు గిరిజన బాలికలతో పాటు అఫ్జల్‌ సోదరులు కూడా హాజరయ్యారు. వీరంతా కలిసి పాటలు పాడుతూ సందడి చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో స్థానిక ఖాప్‌ పంచాయతీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచారాలను మంట కలిపారనే కారణంతో బాలికలతో పాటుగా యువకులను కూడా చంపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వీడియోలో కనిపించిన ఐదుగురిని 2012లో వారి కుటుంబ సభ్యులు, తోబట్టువులే హత్య చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరి హత్యలు జరిగిన ఏడాది తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అఫ్జల్‌ సోదరులను హతమార్చారు. అప్పటి నుంచి అఫ్జల్‌ కూడా ప్రాణ భయంతో వివిధ ప్రాంతాలు మారుతూ ఉన్నాడు.

కాగా పాకిస్తాన్‌లో సంచలనం సృష్టించిన ఈ పరువు హత్యలను వెలుగులోకి తేవడంతో అఫ్జల్‌ కోహిస్తానీ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు. అమెరికాకు చెందిన వైస్‌ న్యూస్‌ ఈ ఉదంతంపై డాక్యుమెంటరీ రూపొందించింది. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా పాకిస్తాన్‌ ప్రధాన న్యాయమూర్తి నిజనిర్ధారణ కమిటీ వేశారు. పరువు హత్యలు జరగనేలేదని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. అంతేకాదు ఇందుకు ఆధారంగా వీడియోలోని బాలికలు వీరే అంటూ ఇద్దరిని ప్రవేశపెట్టింది కూడా. అయితే మానవ హక్కుల కార్యకర్తలు మాత్రం వీటిని ఖండించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే బాధితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన దాదాపు ఏడేళ్ల తర్వాత అఫ్జల్‌ కూడా హత్యకు గురవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.​

మరిన్ని వార్తలు