మొసాక్ ఫోన్సెకా ప్రధాన కార్యాలయంపై దాడి

13 Apr, 2016 13:39 IST|Sakshi
మొసాక్ ఫోన్సెకా ప్రధాన కార్యాలయంపై దాడి

పనామా పేపర్లు సృష్టించిన సంచలనంతో.. మొసాక్ ఫోన్సెకా సంస్థ ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు. అక్కడి నుంచే భారీ మొత్తంలో వివరాలు లీకవుతుండటంతో పోలీసులు స్పందించారు. పన్నులు ఎగ్గొట్టడానికి విదేశాల్లో ఉన్న బినామీ కంపెనీలలో పెద్దమొత్తంలో నిధులు పెట్టుబడిగా చూపించినవాళ్ల జాతకాలను 'పనామా పేపర్స్' ద్వారా బయటపెట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆ సంస్థ వాదిస్తోంది. తాము హ్యాకింగ్ బాధితులమని, సమాచారాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతోంది.

తమ విదేశీ ఆర్థిక పరిశ్రమ విషయంలో మరింత పారదర్శకత తెచ్చేందుకు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని పనామా ప్రెసిడెంట్ జువాన్ కార్లోస్ వారెలా హామీ ఇచ్చారు. వ్యవస్థీకృత నేరాల విభాగం అధికారులతో కలిసి పోలీసులు ఈ దాడి చేశారు. వివిధ పత్రికలలో ప్రచురితమైన కథనాలకు సంబంధఙంచిన సమాచారం, పత్రాలను స్వాధీనం చేసుకోడానికే ఈ దాడులు చేసినట్లు అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది. సంస్థకు చెందిన ఇతర కార్యాలయాల్లో కూడా దాడులు చేస్తామన్నారు. తాము అధికారులకు పూర్తిగా సహకరిస్తామని మొసాక్ ఫోన్సెకా సంస్థ ఒక ట్వీట్ ద్వారా తెలిపింది. విదేశాల్లో ఉన్న సెర్వర్ల ద్వారా తమ కంపెనీని ఎవరో హ్యాక్ చేశారని, దీనిపై ఇప్పటికే తాము పనామా అటార్నీ జనరల్ కార్యాలయంలో ఫిర్యాదుచేశామని మొసాక్ ఫోన్సెకా సంస్థ భాగస్వామి రామన్ ఫోన్సెకా తెలిపారు. ఈయన గతంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు