కరోనా: ‘డోంట్‌ కేర్‌’ అంటున్న అమెరికన్లు!

30 May, 2020 20:45 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్నా ‘డోంట్‌ కేర్‌’ అంటూ గడిపేస్తున్నారు అమెరికన్లు. కరోనా మరణాలు లక్ష దాటినా అమెరికా వాసులు ఏమాత్రం లెక్కచేయకుండా వేసవి సెలవులను హాయిగా గడిపేస్తున్నారు. బీచ్‌లు, పార్క్‌ల్లో ఆడుతూ పాడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కరోనా దెబ్బకు దాదాపు 4.8 కోట్ల ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయమన్న హెచ్చరికలను బేఖాతరు చేస్తూ హోటళ్లకు క్యూ కడుతున్నారని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ వెల్లడించింది. ‘మా లివింగ్‌ రూము నుంచి కరోనా వైరస్‌పై పోరాటం కొనసాగించలేమ’ని జార్జియా గవర్నర్‌ బ్రియన్‌ కెంప్‌ వ్యాఖ్యానించారంటే అమెరికాలో పరిస్థితిలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌ను ప్రజలు ఇష్టపడటం లేదని, సాధారణ జీవితాన్ని పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున పౌరులు డిమాండ్‌ చేస్తున్నారని గత మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. (కోవిడ్‌ టెన్షన్‌; గంటకో మరణం!)

కరోనా వైరస్‌కు భయపడి రోజుల తరబడి ఇంట్లోనే కూర్చోలేమని, వేసవి సెలవులను వృధాగా పోనియ్యలేమని అమెరికన్లు అంటున్నారు. కాలిఫోర్నియా శుక్రవారం నుంచి లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో జనం బయటకు వచ్చారు. డీస్నీ వర‍ల్డ్‌ కూడా జూలై 11 నుంచి దశలవారీగా తెరుచుకోనుంది. లాగ్‌వెగాస్‌లోని బెల్లాజియో, ఎంజీఎం గ్రాండ్‌ త్వరలోనే తెరుచుకోనున్నాయి. కరోనా విపత్తు సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉందని, అప్పటివరకు ఇళ్లకే పరిమితమైతే ఇతర సమస్యలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కరోనా విపత్తు సమయంలో అమెరికా పురుషుల్లో కుంగుబాటు స్వభావం రెండింతలు పెరిగినట్టు సెన్సస్‌ బ్యూరోతో ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ వీక్లీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కరోనా మహమ్మారిని సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల కొంతమంది, సీరియస్‌గా తీసుకోవడం వల్ల మరికొంత మంది కుంగుబాటుకు గురయ్యారని నిపుణులు వెల్లడించారు. (అమెరికాకు ఇరాన్‌ వార్నింగ్‌)

మరిన్ని వార్తలు