కార్చిచ్చుకు 9 మంది బలి

11 Nov, 2018 03:27 IST|Sakshi
కాలిఫోర్నియాలో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

కాలిఫోర్నియా అడవుల్లో తగ్గని మంటలు

పారడైజ్‌: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అడవుల్లో చెలరేగుతున్న మంటల ధాటికి శుక్రవారం రాత్రికి మరణించిన వారి సంఖ్య 9కి చేరింది. పదుల సంఖ్యలో మనుషులు ఆచూకీలేదు. వివిధ ప్రాంతాల్లోని వేలాది మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలోని మొత్తం 26 వేల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. మరణించిన వారంతా బుట్టే కౌంటీలోని ప్యారడైస్‌ పట్టణవాసులే. ఉధృతమైన గాలుల కారణంగా కార్చిచ్చు ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. ప్యారడైజ్‌లో వందలాది ఇళ్లు, అనేక రెస్టారెంట్లు, వాహనాలు కాలిపోయాయి.  70 వేల ఎకరాలను కార్చిచ్చు బూడిద చేసిందనీ, ఇంకా మంటల తీవ్రత తగ్గలేదని కాలిఫోర్నియా అగ్నిమాపక విభాగం అధికారి తెలిపారు.

అటు దక్షిణ కాలిఫోర్నియాలోని వెంచురా కౌంటీలోనూ రెండు కార్చిచ్చులు మొదలయ్యాయి. సియార్రా నెవాడా పర్వతాల దిగువన, చికో పట్టణంలో నివసిస్తున్న 52 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సూచించారు. వెంచురా కౌంటీలో ‘వూల్సీ ఫైర్‌’ ధాటికి 35 వేల ఎకరాలు కాలిపోయాయనీ, 88 వేల ఇళ్ల నుంచి ప్రజలను ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించామని అధికారులు చెప్పారు. హాలీవుడ్‌ ప్రముఖులు నివాసం ఉండే మాలిబు నగరానికీ కార్చిచ్చు వ్యాపిస్తోంది. లియోనార్డో డికాప్రియో, జాక్‌ నికోల్సన్, జెన్నిఫర్‌ అనిస్టన్‌; హాల్లే బెర్రీ, చార్లైజ్‌ థెరాన్, బ్రాడ్‌ పిట్‌ తదితరులు ఈ ప్రాంతంలోనే నివసిస్తారు.

మరిన్ని వార్తలు