‘నా తల బెలూన్‌లా ఉబ్బిపోయింది’

3 Dec, 2018 19:12 IST|Sakshi

పారిస్‌ : బ్యూటి ఉత్పత్తులు వాడే ముందు వాటి మీద ఒక హెచ్చరిక తప్పక కనిపిస్తుంది. ‘ఈ ఉత్పత్తులను వాడే ముందు ఒకసారి ప్యాచ్‌ టెస్ట్‌ (డైరెక్ట్‌గా వాడకుండా.. చేతి మీద లేదా చెవి వెనక వైపున రాసి చూడండి) చేయండి. 24 గంటల్లోపు ఏలాంటి చెడు ప్రభావం లేకపోతే అప్పుడు పూర్తిగా వాడండి’ అని ఉంటుంది. ఎందుకంటే సదరు ఉత్పత్తుల్లో వాడిన రసాయనాలు మన శరీరానికి సరిపోకపోతే దారుణమైన పరిస్థితులు చవి చూడాల్సి వస్తుంది కాబట్టి. కానీ ఈ ప్యాచ్‌ టెస్ట్‌​ ఓ మహిళ పాలిట శాపంగా మారింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా తలకు రంగేద్దామనుకుని హెయిర్‌ డైని ప్రయత్నిస్తే.. ఏకంగా తల ఆకారమే మారిపోయింది.

వివరాలు.. పారిస్‌కు చెందిన  ఓ పంతొమ్మిదేల్ల పడుచు తలకు కలర్‌ చేసుకుందామని సూపర్‌ మార్కెట్‌ నుంచి ఓ ప్రముఖ హెయిర్‌ డైని తీసుకొచ్చింది. ప్యాకెట్‌ మీద సూచించిన విధంగా ప్యాచ్‌ టెస్ట్‌ చేయడం కోసం కొద్దిగా రంగును తల మీద అప్లై చేసింది. కొద్ది సేపటికే తలలో విపరీతమైన దురద రావడంతో డాక్టర్‌ దగ్గరకు పరిగెత్తింది. డాక్టర్లు ఆమెను పరిశీలించి కొన్ని మందులు, ఓ క్రీమ్‌ ఇచ్చారు. వాటిని వాడింది. మరుసటి రోజు ఉదయం లేచి చూసే సరికి సదరు యువతి తల అనూహ్యమైన రీతిలో ఉబ్బి పోయి కనిపించింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటమే కాక నాలుక కూడా ఉబ్బటంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్లు ఆమెని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆమె వాడిన హెయిర్‌ డైలో పారాఫినైలినిడయమినే(పీపీడీ) అనే రసాయనం ఎక్కువగా ఉందని తేల్చారు. ఈ రసాయనం వల్ల 56 సెంటీమీటర్లు ఉన్న యువతి తల ఏకంగా 63 సెంటీమీటర్లకు పెరిగింది.

దీని గురించి సదరు యువతి ‘పొద్దున లేచే సరికే నా తల సైజు పెరిగి.. ఒక లైట్‌ బల్బ్‌గా మారింది’ అని తెలిపింది. యువతిని ఓ రోజంతా అబ్జర్వేన్లలో ఉంచిన డాక్టర్లు చివరకు ఆమె తలను పూర్వ స్థితికి తీసుకువచ్చారు. ముఖ్యండా హెయిర్‌ డైలో ఉండే ఈ పీపీడి రసాయనం వల్ల మూత్రపిండాలు పని చేయకపోవడం.. కండరాలు దెబ్బతినడం వంటి దుష్పరిణామాలు కల్గుతాయంటున్నారు వైద్యులు. అందంగా తయారు కావడం కోసం చేసే ప్రయత్నాలు బెడిసి కొడితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. కాబట్టి మనం వాడే ఉత్పత్తుల పట్ల జాగ్రత‍్తగా ఉండాలి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు