సుప్రీంకోర్టులో బ్రిటన్‌కు చుక్కెదురు

24 Jan, 2017 16:47 IST|Sakshi
సుప్రీంకోర్టులో బ్రిటన్‌కు చుక్కెదురు

లండన్‌: బ్రిటన్‌ ప్రభుత్వానికి ఆ దేశ సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. యూరోపియన్‌ యూనియన్ నుంచి బ్రిటన్‌ వైదొలిగే కార్యక్రమం(బ్రెగ్జిట్‌.. బ్రిటన్‌ ఎగ్జిట్‌)కోసం జరిగే అధికారిక చర్చను ఇప్పుడే ప్రారంభించడానికి వీల్లేదని, తొలుత పార్లమెంటులో ఓటింగ్‌ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం పార్లమెంటు ఎంపీల మద్దతు స్పష్టంగా తెలుసుకునేంత వరకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే చర్చలు ప్రారంభించరాదు. మార్చి 31లోగా ఎంపీల మద్దతు పొందాలని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

అయితే, స్కాటిష్‌ పార్లమెంటు, వేల్స్‌, నార్తర్న్‌ ఐర్లాండ్‌ అసెంబ్లీలు మాత్రం తమ అభిప్రా‍యం చెప్పాల్సిన పని లేదని పేర్కొంది. బ్రెగ్జిట్‌ సెక్రటరీగా వ్యవహరిస్తున్న డేవిడ్‌ డేవిస్‌ ఎంపీలకు ఈ విషయాన్ని ఈ రోజే తెలియజేయనున్నారు. మరోపక్క, బ్రెగ్జిట్‌ మద్దతుదారులు మాత్రం బ్రిటన్‌ పార్లమెంటులో ఓటింగ్‌ నిర్వహించడం అప్రజాస్వామిక చర్య అని అంటున్నారు.

కాగా, గతంలోనే ఈ విషయంపై బ్రిటన్‌ ప్రభుత్వానికి హైకోర్టులో కూడా చుక్కెదురైంది. పార్లమెంటు అనుమతి లేకుండా లిస్బన్‌ ట్రిటీకి చెందిన ఆర్టికల్‌ 50ను ప్రభుత్వం అమలుచేయలేదని ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ గత ఏడాది నవంబర్‌లో హైకోర్టు స్పష్టం చేసింది. బ్రిగ్జిట్‌ విషయంలో ప్రధాన మంత్రి ఏకపక్షంగా వ్యవహరించే వీలు లేదని, ఈ విషయంలో పార్లమెంటే ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లార్డ్‌ థామస్‌ ఆ సమయంలో తీర్పిచ్చారు. ఈయూ నుంచి ఏదైనా సభ్యదేశం వైదొలగాలంటే అది అనుసరించాల్సిన ప్రక్రియకు సంబంధించినదే లిస్బన్‌ ట్రిటీకి ఆర్టికల్‌ 50.  

మరిన్ని వార్తలు