మెస్మరైజింగ్.. మిషెల్

27 Jul, 2016 04:46 IST|Sakshi
మెస్మరైజింగ్.. మిషెల్

డెమొక్రటిక్ పార్టీ సదస్సులో ఉద్వేగభరిత ప్రసంగం
- హిల్లరీకే అధ్యక్ష పదవికి అర్హత ఉందని వ్యాఖ్య
 
 ఫిలడెల్ఫియా : అమెరికా అధ్యక్షపదవి చేపట్టటానికి డెమోక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్ ఒక్కరే అర్హురాలంటూ ఆ దేశ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా మద్దతు ప్రకటించారు. మంగళవారం ఫిలడెల్ఫియాలో పార్టీ జాతీయ సదస్సులో ఆమె ప్రసంగిస్తూ.. ఒక మహిళ అమెరికా అధ్యక్షురాలు కాగలదని హిల్లరీ  కారణంగా తన కుమార్తెలతో పాటు దేశంలోని యువత విశ్వసిస్తోందని పేర్కొన్నారు. అదే సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ద్వేషపు మాటలు మాట్లాడేవారు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే వారు దేశాధ్యక్ష పదవికి తగరని వ్యాఖ్యానించారు. మిషెల్ పావుగంట ఉద్వేగ ప్రసంగం పార్టీ డెలిగేట్లను కదిలించింది.

అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేయాలన్న ట్రంప్ నినాదాన్ని ఎండగడుతూ.. ప్రపంచంలో అమెరికా అతి గొప్ప దేశమని, ఇంతకుముందు ఒక ఆఫ్రికా-అమెరికా జాతీయుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతోపాటు, ఇప్పుడు ఓ మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకోగలిగే అవకాశం లభించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. ‘బానిసలు కట్టిన శ్వేతసౌధంలో ప్రతి ఉదయం నిద్ర లేస్తుంటాను. నా ఇద్దరు కుమార్తెలు.. అందమైన, తెలివైన నల్ల యువతులు శ్వేతసౌధం ఆవరణలో కుక్కపిల్లలతో ఆడుకోవడాన్ని చూస్తుంటాను. వారి తండ్రి పౌరసత్వాన్ని ప్రశ్నించే వారిని, ఆయన విశ్వాసాన్ని ప్రశ్నించే వారిని విస్మరించాలని, టీవీ చానళ్లలో ప్రముఖుల విద్వేష ప్రసంగాలు అమెరికా వాస్తవ స్ఫూర్తికి ప్రాతినిధ్యం కాదని వారికి మనమెలా చెప్పగలం? వారు దిగజారినపుడు మనం మరింత ఉన్నతంగా ప్రవర్తించాలి అని చెప్తాం’ అని అన్నారు. ఈ ప్రసంగానికి డెలిగేట్లు హర్షాతిరేకాలతో స్పందించగా కొందరు ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు