8 గంటల్లో ఇంటిని ప్రింట్ చేసే రోబో

7 Jan, 2018 12:05 IST|Sakshi

ఇళ్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు అని పెద్దవాళ్లు ఎప్పుడూ ఓ సామెత చెబుతారు. ఎందుకంటే రెండిటికీ అయ్యే ఖ‌ర్చు, శ్రమ అంతా ఇంతా కాదు. పెళ్లి విషయం పక్కనే పెడితే ఇళ్లును మాత్రం గంటల్లోనే నిర్మించి ఇస్తానంటోంది ఉక్రెయిన్ కు చెందిన గృహనిర్మాణ స్టార్టప్‌ పాసివ్డోమ్. 2017లోనే ప్రారంభమైన పాసివ్డోమ్కు అమెరికాలో ఇప్పటికే 8000 ముందస్తు ఆర్డర్లు వచ్చాయి.  మొదటి 100 ఆర్డర్లను ఈ నెలలోనే(జనవరి) డెలివరీ ఇవ్వడం ప్రారంభించారు. 410 చదరపు అడుగల విభాగంలో ఈ గృహాల ధరలు 64 వేల డాలర్ల నుంచి 97 వేల డాలర్ల వరకు ఉన్నాయని  డిజైనర్ మారియా సోరోకినా తెలిపారు.

3డీ ప్రింటింగ్ రోబోతో గోడలు, ఇంటి పైకప్పు, నేలను ప్రింట్ చేస్తారు. 410 చదరపు అడుగుల డిజైన్ ఇంటికి రోబో తీసుకునే సమయం కేవలం 8 గంటలు మాత్రమే. అయితే రోబోతో పని ముగిసిన తర్వాత కిటికీలు, తలుపులు, ప్లంబింగ్, విద్యుత్ వ్యవస్థలను మనిషి బిగిస్తే సరిపోతుంది.

ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత విద్యుత్ కోసం బయటి నుంచి కనెక్షన్లు గానీ,  నీటి కోసం బోర్లు లేక సంపుల సాయం కూడా అవసరం లేదు. పూర్తిగా స్వయం ప్రతిపత్తిగల ఇళ్లు అన్నమాట. సౌర శక్తిని ఉపయోగించడానికి  శక్తివంతమైన బ్యాటరీలను ఉపయోగించి, అక్కడి నుంచి నేరుగా ఇంటి అవసరాలకు ఉపయోగిస్తారు. గాలిలోని తేమను నీటిగా మార్చే పరికరం అందులో ఉంటుంది. అంతేకాకుండా మురికి నీటి శుద్ధి కోసం ఇంట్లోనే స్వతంత్ర వ్యవస్థ ఉంది.


ఇంటి తలుపు తెరిచి చూస్తే పై ఫోటోలో చూపిన విధంగా కనిపిస్తుంది. పాసివ్ డోమ్ ఇంట్లో కిచెన్తోపాటూ విశాలమైన ఖాళీ స్థలం ఉంటుంది. నేలను పైకప్పును కలిపేలా భారీ గాజు కిటికీలు ఉంటాయి. ఈ మోడల్ నిర్మాణాల్లో ప్రత్యేక బెడ్ రూంలు ఉండవు. కిచెన్ పక్కనే ఒక బాత్ రూం ఉంటుంది.

పట్టణాలకు, కాంక్రీటునిర్మాణాలకు దూరంగా నివాసం ఉండాలంటే చాలా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అన్ని సౌకర్యాలు లభించే ఇళ్లు లభించే అవకాశం ఉండకపోవచ్చు. ఈ టెక్నాలజీతో నిర్మించిన గృహాలు సముద్రతీరాల్లో, పర్వతాల్లో, అడవుల్లో, పల్లెల్లో ఎక్కడైనా నిర్మించుకొని అన్ని సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చు అని  సోరోకినా పేర్కొన్నారు.

775 చదరపు అడుగుల విభాగంలో ఇంటి ధరలు 97 వేల డాలర్ల నుంచి 147 వేల డాలర్లు వరకు ఉన్నాయి. ఈ గృహాలను నిర్మించడానికి, ఉక్రెయిన్, కాలిఫోర్నియాలోని పాసివ్డోమ్ టీమ్ సభ్యలు ముందుగా 3డీ ప్రింటర్ కోసం ఓ బ్లూ ప్రింట్ ను తయారు చేస్తారు. ఒక్కో పొరను ఒకదాని తర్వాత ఒకటి రోబో ప్రింట్ చేస్తుంది. ఇంటి పైకప్పు, నేల, 20 సెంటీ మీటర్ల మందంతో ఉండే గోడలు( కార్బన్ ఫైబర్స్, పాలీరిథేన్, రిసిన్స్, బాసాల్ట్ ఫైబర్స్, ఫైబర్ గ్లాస్ లను ఉపయోగించి) నిర్మిస్తుంది.

3డీ ప్రింటింగ్ పద్దతిలో తక్కువ ధరల్లోనే ఎక్కువ సమర్థవంతమైన ఇళ్లను నిర్మించవచ్చని సోరోకినా అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా నివసించడానికి ఇళ్లులేని వారు చాలా మంది ఉన్నారని, వారందరికి సమర్ధవంతమై ఇళ్లు తక్కువ సమయంలోనే నిర్మించి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

మరిన్ని వార్తలు