నెమలి హత్య, పిల్లి దోషి, పోలీసుల సస్పెన్షన్

21 Mar, 2014 13:27 IST|Sakshi
నెమలి హత్య, పిల్లి దోషి, పోలీసుల సస్పెన్షన్

అనగనగా ఒక నెమలి. అది రాజుగారింట్లో హాయిగా ఆడుకుంటుంది. ఒక రోజు ఎక్కడినుంచో ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది. రెండూ కాసేపు పలకరించుకున్నాయి. ఆ తరువాత కొద్ది సేపటికి పిల్లికి ప్రేమ ఎక్కువైపోయి నెమలి గొంతును కసక్కుమని కొరికేసింది. ఆ నెమలి కాస్తా చచ్చి ఊరుకుంది.


రాజుగారికి పట్టలేనంత కోపం వచ్చింది. నా ప్రియమైన నెమలిని చచ్చిపోనిస్తారా. 'ఠాఠ్... వీల్లేదు' అని ఆయన హుంకరించారు. అయితే పిల్లి దొరకలేదు. దాంతో ఆయన కాపలా కాస్తున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసి పారేశారు. 'పాడు పిల్లి ఇంతపని చేస్తుందనుకోలేదు,' అని పాపం ఆ పోలీసులు లబోదిబో మంటున్నారు.


ఈ సంఘటన జరిగింది పాకిస్తానీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గారి ఫార్మ్ హౌస్ లో. ఈ ఫార్మ్ హౌస్ రాయ్విండ్ అనే చోట ఉంది. ఆ మధ్య మనదేశంలో ఒక మంత్రిగారి గేదెలు చెప్పాపెట్టకుండా టూర్ కి వెళ్లిపోతే పోలీసులను సస్పెండ్ అయ్యారు.  మరి పొరుగుదేశంలోని ప్రధానమంత్రి గారింట్లో నెమలి చనిపోతే ఆ మాత్రం శిక్ష పడకూడదా మరి?

మరిన్ని వార్తలు