కరోనా : అవిప్పుడు స్వేచ్ఛా జీవులు

2 Apr, 2020 11:09 IST|Sakshi
వేల్‌ను ఆసక్తిగా చూస్తున్న పెంగ్విన్‌

చికాగో : కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఆ పెగ్విన్స్‌కు స్వేచ్ఛ లభించింది. తాము ఇన్ని రోజులు మగ్గిపోయిన అక్వేరియంలో ఇప్పుడు మహారాజుల్లా తిరిగేస్తున్నాయి. తమ రాజ్యంలోని ఇతర జీవులను చూస్తూ టైం పాస్‌ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ పూర్తిగా ప్రబలడంతో అమెరికా మొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చికాగోకు చెందిన షేడ్‌ అక్వేరియాన్ని కూడా మూసేశారు. అయితే అక్వేరియంలో ఉండే పెంగ్విన్‌లను లోపల స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు. దీంతో విల్లింగ్టన్‌ అనే పెంగ్విన్‌ అక్వేరియాన్ని చుట్టేస్తూ అందులోని జంతువులను చూస్తూ ఆనందపడిపోతోంది.

ఆసక్తిగా ఒకదాన్నొకటి చూసుకుంటున్న వేల్‌, పెంగ్విన్‌

మంగళవారం కయావక్‌, మోయక్‌, బేబీ అన్నిక్‌ అనే వేల్స్‌ల దగ్గరకు వెళ్లి చూసి వచ్చింది. అక్కడే ఉంటున్న మరో రెండు పెంగ్విన్‌లు టిల్లీ, కార్మిన్లు కూడా వేల్స్‌లను చూసోచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మిలియన్ల వ్యూస్‌తో ముందుకు దూసుకుపోతున్నాయి. దీనిపై అక్వేరియం సిబ్బంది మాట్లాడుతూ.. ‘‘ విల్లింగ్టన్‌ వేల్స్‌ దగ్గరకు వెళ్లినపుడు అవి చాలా ఆసక్తిగా దాన్ని చూడసాగాయి. ఎందుకంటే అవెప్పుడూ పెంగ్విన్స్‌ను చూసెరుగవ’’ని పేర్కొన్నారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా జూలు, అక్వేరియాలు మూతపడటంతో అక్కడి జంతువులు లోపలే స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పిస్తున్నారు సంరక్షకులు. 

మరిన్ని వార్తలు